
ఇద్దరు చైన్‌స్నాచర్స్ అరెస్టు
రాయచోటి జగదాంబసెంటర్ : పలు ప్రాంతాలలో బంగారు, వెండి ఆభరణాల చోరీలకు పాల్పడ్డ ఇద్దరు చైన్‌స్నాచర్స్‌ను అరెస్టు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కృష్ణమోహన్ అర్బన్ సీఐ బివి చలపతితో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కడప అగాడి సెంటర్‌కు చెందిన షేక్ నమాస్ అలియాస్ మస్తాన్‌పై రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు, ప్రొద్దుటూరు ఒన్‌టౌన్, టూ టౌన్, బనగానపల్లి, యర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, ఖాజీపేట పోలీస్‌స్టేషన్లలో 9 చోరీ కేసులు ఉండగా, కడప జిల్లాలో మరో మూడు ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి 215 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలను రికవరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.21.30 లక్షలు ఉండగా రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి ట్విన్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా కడప టౌన్ మోచంపేటకు చెందిన మహమ్మద్‌షా అలీజబ్రి అలియాస్ షేక్ మహమ్మద్ రెహమాన్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సోహెల్‌పై రాయచోటి అర్బన్, చెన్నూరు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉండగా, ఇతని వద్ద నుంచి 95 గ్రాముల మూడు తాళిబొట్లు, చైన్లు స్వాధీనం చేసుకోగా వీటి విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన అర్బన్ సీఐ చలపతి, ఎస్‌ఐలు బాలకృష్ణ, అబ్దుల్‌జహీర్, రామకృష్ణ, సిబ్బంది అమరనాథ్, బాబ్జీ, రామకృష్ణ, సురేంద్ర, సీసీఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్రలను రాయచోటి డీఎస్పీ అభినందించారు.