
భూ ఆక్రమణకు కూటమి నేతల కుట్ర
● తమ భూమికి అన్ని ఆధారాలు ఉన్నా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని రైతు ఆవేదన
● హోం మంత్రికి ఫిర్యాదు చేసినా
పట్టించుకోని వైనం
● కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా మామిడి చెట్లు నరికి కంచె తొలగించారని ఆరోపణ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తనకు వారసత్వంగా వచ్చిన రిజిస్టర్డ్‌భూమిని తాను గత 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నానని, అయితే కూటమి నాయకులు దౌర్జన్యంగా తన పొలంలో ఉన్న 25 మామిడి చెట్లను నరికి వేసి, తన పొలం చుట్టూ వేసుకున్న ఇనుప కంచెను తొలగించారని రైతు చెన్న కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కుర్నూతల గ్రామం, మూలపల్లెకు చెందిన ఎ.చెన్నారెడ్డికి అదే గ్రామ పొలంలో సర్వే నంబరు 792/2 లో 0.63 సెంట్లు, 797/3లో 1.71 ఎకరాలు పొలం ఉంది. తన పొలం పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన వేల్పుచర్ల ఓబుల్ రెడ్డి, సహదేవరెడ్డి, వాసుదేవరెడ్డి, మాజీ సైనికుడు రమణారెడ్డి తదితర కూటమి నేతలు తమపై దాడిచేసి తన పొలంలోని కొంత భాగాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు పేర్కొన్నారు. ఈ విషయమై 2023లోనే అప్పటి తహసీల్దార్, సీఐ, ఎస్‌ఐకి ఫిర్యాదు చేశామన్నారు. వారి ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారుల సూచన మేరకు తహసీల్దార్, సర్వేయర్, సీఐ, ఎస్‌ఐల సమక్షంలోనే తమ పొలం చుట్టూ ఇనుప స్థంభాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తమ పొలంతో పక్క పొలం వారికి ఎలాంటి సంబంధం లేదని లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని రైతు చెన్నారెడ్డి తెలిపారు. తమ పొలానికి అన్ని రికార్డులు సవ్యంగా ఉండటంతోపాటు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా కూటమి నేతలు తమకు తెలియకుండా తమ పొలంలో నాటిన ఇనుప కంచెను తొలగించి, స్తంభాలను ఎత్తుకెళ్లడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు తమ భూమికి సంబంధించిన రికార్డులను లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించామని, కూటమి నాయకులు వారి రికార్డులను తీసుకురాకుండానే తమ పొలంలో ఉన్న 25 మామిడి చెట్లను దౌర్జన్యంగా నరికేయడంఓ రూ.3 లక్షల పైబడి తమకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తనకు న్యాయం చేయడంతో పాటు కూటమి నాయకుల నుంచి రక్షణ కల్పించాలని రైతు కోరుతున్నాడు.

భూ ఆక్రమణకు కూటమి నేతల కుట్ర