
మీ సహకారం మరువలేను
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీగా 14 నెలల పాటు సేవలందించి బదిలీపై కృష్ణా జిల్లా ఎస్పీగా వెళ్లిన వి.విద్యాసాగర్‌నాయుడుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ దంపతులను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో శనివారం అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. స్థానిక ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ సేవలను కొనియాడారు. ఎస్పీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో తాము పార్వతీపురం మన్నెం జిల్లాలో కలిసి పనిచేశామన్నారు. ఆయనకున్న నిబద్ధత, నిజాయితీని ప్రశంసించారు. నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు సేవలు జిల్లాకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. బదిలీ ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ గత 14 నెలలలో నేరాల నియంత్రణ, పిల్లలపై నేరాలను అరికట్టడం, మహిళల కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం.. ప్రజలకు మంచి సేవలు అందించానన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి, మదనపల్లి డీఎస్పీలు కృష్ణమోహన్, మహేంద్ర, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు