
తగ్గిన ధరలకే వస్తువులు విక్రయించాలి
గుర్రంకొండ: జీఎస్టీతో తగ్గిన ధరల మేరకే అన్ని రకాల వస్తువులను విక్రయించాలని జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సూపర్ జీఎస్టీ– సూపర్‌సేవింగ్స్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనశాలలను సందర్శించి, సూపర్ జీఎస్టీ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుకాణాల వద్ద గతంలో ఉన్న ఎమ్మార్పీ ధరలు, ప్రస్తుతం జీఎస్టీతో తగ్గిన ధరల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా అఽధిక ధరలకు, పాత ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయట్రాక్టర్లు, వ్యవసాయయంత్రాలపైన 12 నుంచి 5 శాతం మేరకు ధరలు తగ్గాయన్నారు. ట్రాక్టర్ విడి భాగాలు, టైర్లు, డ్రోన్లపైన 18 నుంచి 5 శాతం మేరకు జీఎస్టీతో తగ్గాయన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తగ్గించిన ధరల మేరకు వ్యాపారులు విక్రయించకపోతే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేయాలంటే జిల్లాస్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ, జిల్లా ఉద్యానశాఽఖాధికారిణి సుభాషిణి, జిల్లా పీడీ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ లక్ష్మీప్రసన్న, ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి, ఏవో రత్నమ్మ, సింగిల్‌విండో చైర్మన్ మూర్తిరావ్, నాయకులు నాయిని జగదీష్, ఎల్లుట్ల మురళీ, సుంకర్ శేఖర్, నౌషాద్, మహాత్మారెడ్డి, చలమారెడ్డిలు పాల్గొన్నారు.
వ్యాపారులపై కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు
జాక్‌పాట్‌ల పేరుతో టమాటా రైతులను వ్యాపారులు ఇష్టానుసారంగా దోచుకొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్‌కు రైతులు, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ను వారు కలిశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ జాక్‌పాట్‌లపేరుతో వ్యాపారులు వందకు 12 నుంచి 15 క్రీట్ల టమాటాలను బలవంతంగా తీసుకొంటున్నారని అన్నారు. మండీల్లో వేలం పాటలు నిర్వహించే సమయంలో టమాటాలను క్రీట్‌లపై రాసులుగా పోస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యాపారులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కమీషన్లు నాలుగుశాతానికి బదులు పదిశాతం తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు.సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా మార్కెట్‌యార్డులో పట్టించుకొనే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్