
ఐచర్ ఢీకొని మహిళ మృతి
మదనపల్లె రూరల్ : బతుకుదెరువు కోసం వచ్చిన మహిళ రోడ్డు దాటే క్రమంలో ఐచర్ వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మండలంలోని వలసపల్లె పంచాయతీలో జరిగింది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం లద్దిగంకు చెందిన మునిలక్ష్మమ్మ(55) జీవనోపాధిలో భాగంగా వలసపల్లె పంచాయతీ గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో హెల్పర్‌గా పనికి కుదిరింది. శుక్రవారం నుంచి గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు ఉండటంతో, స్వగ్రామం నుంచి గురువారం సాయంత్రం బయలుదేరింది. పుంగనూరు నుంచి ఆటోలో మరో మహిళతో కలిసి బయలుదేరిన మునిలక్ష్మమ్మ, గ్రీన్‌వ్యాలీ స్కూల్ ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున దిగింది. తోడు వచ్చిన మహిళ ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా, మునిలక్ష్మమ్మ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో హైవేపై వేగంగా వస్తున్న ఐచర్ వాహనం మునిలక్ష్మమ్మను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె రెడ్డెమ్మ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బస్సు, బైక్ ఢీకొని
వ్యక్తికి గాయాలు
సుండుపల్లె : మండల పరిధిలోని మడితాడు వంక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం నుండి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మడితాడు గ్రామం చండ్రాజుగారిపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారుడు సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
‘శ్రీశక్తి’ విజయంలో
ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం
రాయచోటి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయం చేయడంలో ఆర్టీసీ కార్మికుల పాత్రం చాలా గొప్పదని విజయవాడ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఇంజనీర్ టి.చంగల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాయచోటి డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపోను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మహేశ్వరరెడ్డి, డిపో యంఎఫ్, గ్యారేజీ కార్మికులు పాల్గొన్నారు.

ఐచర్ ఢీకొని మహిళ మృతి