
సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
మదనపల్లె రూరల్ : భార్య తన మాట వినకపోవడం, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన భర్త సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. కలకడ మండలం ఎనుగొండపాలెం మొరమ్మీదపల్లెకు చెందిన నామాల రెడ్డిశేఖర్‌నాయుడు, మౌని భార్యాభర్తలు. బతుకుదెరువులో భాగంగా మదనపల్లెకు వలస వచ్చి చెంబకూరురోడ్డు రాగిమానుసర్కిల్ సమీపంలో కాపురం ఉంటున్నారు. హోటల్‌లో వంట పనులు చేస్తూ జీవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రెడ్డిశేఖర్‌నాయుడు కర్ణాటక రాష్ట్రం చింతామణిలో పనిచేసేందుకు వెళ్లాడు. దీంతో భార్య మౌని, భర్తకు చెప్పకుండా మదనపల్లెలో ఇల్లు ఖాళీ చేసి, స్వగ్రామానికి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం మదనపల్లెకు వచ్చి గతంలో పని చేసిన హోటల్‌లో పనికి కుదిరింది. తనకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేయడం, పల్లెలో ఉండకుండా మళ్లీ టౌన్‌కు రావడం, ఎందుకు వచ్చావని నిలదీస్తే... తనపైనే తిరగబడటంతో అవమానం భరించలేక సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పట్టణంలోని కదిరిరోడ్డు బ్రహ్మంగారి గుడి వద్ద సెల్‌టవర్ వద్దకు వచ్చి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిశేఖర్‌నాయుడును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.