
ఏపీఎండీసీ పాఠశాల ఉద్యోగి మృతి
ఓబులవారిపల్లె : ‘ఏమి జరిగిందో ఏమో తెలియదు’ కానీ.. ఏపీఎండీసీ పాఠశాల ఉద్యోగి పసుపులేటి రవితేజ(26) శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీఎండీసీ పాఠశాల ప్రారంభం నుంచి పసుపులేటి రవితేజ అక్కడ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సెక్యూరిటీ ఉద్యోగంతోపాటు పాఠశాలలో టీలు అందించడం, ఇతర పనులు కూడా చేస్తుంటాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఏపీఎండీసీ పాఠశాల రక్షణగోడ పక్కనే ఉన్న తాగునీటి మోటారు వేసేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పాఠశాల పై అంతస్తులో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు గమనించి ప్రధానోపాధ్యాయురాలికి సమాచారం ఇచ్చారు. అందరూ అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే రవితేజ మృతి చెంది ఉన్నాడు. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎండీసీ పాఠశాలలో పని ఒత్తిడి కారణంగా రవితేజ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ పనులతోపాటు ఇతర పనులు కూడా చేయించుకుంటూ ఉండటంతో రవితేజ ఇబ్బందులు పడేవాడని వారు తెలిపారు. పని ఒత్తిడితో గుండెపోటుతో చనిపోయాడా, విద్యుత్ షాక్‌తో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది. రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మహేష్ నాయుడు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. మృతికి సంబంధించిన కారణం తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.