
ఎస్పీ చొరవతో గల్ఫ్ బాధితురాలికి విముక్తి
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి చొరవతో గల్ఫ్ దేశమైన కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న మహిళకు విముక్తి లభించింది. జిల్లాలోని ములకల చెరువు మండలానికి చెందిన బత్తల నాగవేణి కువైట్‌లో అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బాధితురాలి తమ్ముడు హరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఎస్పీ కిందిస్థాయి పోలీసు అధికారులను విచారణకు ఆదేశించారు. తక్షణం ఏజెంట్లను విచారించి అధికారులతో సమన్వయం చేసి బాధితురాలిని స్వదేశానికి రప్పించారు. బాధితురాలు నాగవేణి, ఆమె తమ్ముడు హరి బుధవారం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు ప్రభుత్వ అనుమతి పొందిన ఏజెంట్ల ద్వారానే ప్రయాణం చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.
– జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ,
జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్
కడప అర్బన్ : వయోవృద్ధులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ అన్నారు. కడప కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్‌లో శ్రీన్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ఙ్ తో పాటు, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వృద్ధుల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భద్రత కల్పించాల్సిన వృద్ధులను విడిచిపెట్టినా, పరిత్యాగం చేసే విధంగా బుద్ధిపూర్వకంగా వ్యవహరించినా గరిష్టంగా మూడు నెలలు జైలు శిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండింటినీ కలిపి విధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.రామమూర్తి నాయుడు, వృద్ధాశ్రమాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.