
బతికి సాధిద్దాం
ఈకింది లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే..
● ఆత్మహత్యలు వద్దు... జీవితమే ముద్దు
● జిల్లాలో ప్రతి ఏడాది పెరుగుతున్న
ఆత్మహత్యలు
● ఈ ఏడాది ఎనిమిది నెలల్లో
191 మంది ఆత్మహత్య
● నేడు ప్రపంచ ఆత్మహత్యల
నివారణ దినోత్సవం
రాజంపేట టౌన్ : జీవితంలో వెనక్కి తీసుకోలేనివి రెండే. ఒకటి గడిచిపోయిన కాలం, రెండవది ప్రాణం. ఆవేశంతో అనాలోచితంగా తీసుకునే నిర్ణయం మనిషి జీవితాన్నే చిదిమేస్తుంది. మనల్ని అమితంగా, పంచ ప్రాణంలా ప్రేమించే కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తుంది. ఏదైనా సాధించాలనుకోవడం.. లేకుంటే గెలవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలే కాని గెలుపే జీవితం కాకూడదు. ఒడినంత మాత్రాన జీవితం వృధా అనుకుంటే భవిష్యత్తు శూన్యంలా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసానికి మించిన విజయం మరొకటి లేదు. ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కటంటే ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. ఏ సమస్యకు ఆత్మహత్యకు పరిష్కారం కాదు. ఇదిలావుంటే ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నేడు ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం
ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, వెలకట్టలేనిది ప్రాణం. జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతుంటాయి. జీవితంలో అన్నింటినీ అధిగమించి అనుకున్న విజయాన్ని సాధించాలే కానీ.. బలహీన మనస్తత్వంతో ప్రాణం తీసుకుంటే ఏం వస్తుంది.. ఏమీ రాదు.. పైగా మన కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతారు.. ఈ విషయం గుర్తుపెట్టుకుని బతికి సాధిద్దాం అనే దిశగా ముందడుగు వేయాలి.
కాగా ఈ ఏడాది ఎనిమిది నెలల వ్యవధిలో జిల్లాలో 191 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఎంతపెద్ద సమస్య అయినా పరిష్కరించుకునేందుకు ఏదో ఒక మార్గంలో అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్నచిన్న సమస్యలకే అనేక మంది మనోస్థైర్యాన్ని కోల్పోయి బలవంతంగా తమచేతులతోనే ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనసు కుదుటపరుచుకొని గుండెనిబ్బరంతో ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఓర్పుగా అడుగులు వేయాలే తప్ప బలవన్మరణానికి పాల్పడితే తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి. తనువు చాలించుకోవడానికి సిద్ధమయ్యాక ఒక్క క్షణం జన్మనిచ్చి కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులను, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అంటూ ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో పిలిచే తోబుట్టువులను, తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎంత కష్టాన్ని అయినా అలవోకగా జయించవచ్చు.
చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలు..
తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేక పోతున్నామని, ప్రేమ విఫలమైందని, చివరికి తల్లిదండ్రులు సెల్‌ఫోన్ చూడవద్దు అన్నందుకు కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యసనాలకు బానిసలవడం, భార్య కాపురానికి రాలేదని భర్త, భర్త కోప్పడ్డాడని భార్య ఇలా చిన్నచిన్న విషయాలకే విబేధాలు, గొడవలు, ఉద్వేగం, కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అధికమవుతున్నాయి. ఇలా ఆత్మహత్యకు పాల్పడేవారంతా సమస్యకు పరిష్కారం వెతుక్కునే సామర్ద్యం లేక, సమస్య పరిష్కారానికి కొంత సమయమైనా వేచిచూసే ఆత్మస్దైర్యం లేనందు వల్ల అర్దాంతరంగా తనువు చాలిస్తూ కన్నవారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టుతున్నారు.
ఉరుకులు పరుగులమయమైన జీవనం కూడా ఒక కారణమే..
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరి బాధను మరొకరు పంచుకునేవారు. కుటుంబంలో ఎవరికై నా ఏదైనా సమస్య వస్తే పెద్దలు ఆ సమస్యను పరిష్కరించి మేమున్నాము అన్న భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగులమయమై జీవనమైంది. అందువల్ల కుటుంబ సభ్యులు వారంలో ఒకరోజైనా ఒకచోట కూర్చొని సరదాగా మాట్లాడుకోలేక పోతున్నారు. ఫలితంగా ఏదైనా సమస్య వచ్చినా కుటుంబ సభ్యులతో చెప్పుకొని పరిష్కరించుకోలేక వారిలో వారే కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి.
ఒంటరితనాన్ని కోరుకుంటారు.
సకాలంలో ఆహారం తీసుకోరు.
రాత్రి వేళల్లో నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
కొన్నిమార్లు అసలు దేనికి కూడా స్పందించరు.
బతికి ఏం లాభమని, చనిపోతే పోతుంది అని ముందుగానే పరోక్షంగా సంకేతాలిస్తారు.
ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే కుటుంబ సభ్యులు గుర్తించాలి.
వారితో ప్రేమగా మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కారానికి తోడ్పాటిచ్చి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.
మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళితే ప్రయోజనం కూడా ఉంటుంది.
అవగాహన లేక పోవడం వల్లే...
సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశమే చాలా సందర్భాల్లో బలవన్మరణాలకు దారితీస్తుంది. జీవితంపై, సమస్యల పరిష్కరించుకునే విధానంపై సరైన అవగాహన లేక పోవడమే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం. ఆత్మహత్యలు చేసుకునేవారు సమస్యను తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప తమ కుటుంబ సభ్యులను మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నామన్న విషయాన్ని గుర్తించలేక పోతున్నారు. తల్లిదండ్రులు కన్నబిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అలాంటప్పుడు కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు, జీవితాంతం మానసిక క్షోభను అనుభవిస్తారు. ఇక కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అందువల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.