
సారా విక్రేత అరెస్ట్
నిమ్మనపల్లె : బుధవారం ముష్టూరు గ్రామానికి చెందిన చిన్నఅప్పోడు(60) స్థానికంగా సారా తయారుచేసి విక్రయిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి పది లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
భార్య కోసం
సెల్ టవర్ ఎక్కిన భర్త
రైల్వేకోడూరు అర్బన్ : తన భార్య ఇంటికి రాలేదని పట్టణంలోని ధర్మాపురానికి చెందిన బాలయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. కల్యాణ్ పదేళ్ల కిందట లతను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లత పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత అడిగినా భార్య రాకపోవడంతో దిగులు చెందిన భర్త పట్టణంలోని పాత తహసీల్దారు కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దారు అమర్‌నాథ్, ఎస్సై లక్ష్మప్రసాద్‌రెడ్డి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడతామని హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు.
ఆగిన ఐచర్‌ను ఢీకొన్న
ప్రమాదంలో ఒకరు మృతి
సంబేపల్లె : సిగ్నల్ లైట్లు వేయకుండా పిన ఐచర్‌ను ఢీకొని జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గుట్టపల్లె సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా రామాంజులు (52) బుధవారం మృతిచెందారు. కలకడ మండలం బాటవారిపల్లెకు చెందిన రామాంజులు ద్విచక్ర వాహనంలో బుధవారం తెల్లవారుజామున రాయచోటికి వసుత్న్నారు. గుట్టపల్లె సమీపంలోకి రాగానే సిగ్నల్ లైట్లు లేకుండా జాతీయరహదారిపై ఆపిన ఐచర్ వాహనాన్ని డీకొన్నారు. ఈ ప్రమాదంలో రామాంజులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు ఘటనల్లో
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని పాయిరామన్న వీధిలో కాపురముంటున్న సోమ శేఖర్(20) డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామసముద్రం మండలంలో చెంబుకూరుకు చెందిన మహేష్ భార్య సునీత (25)కు జ్వరంతో బాధపడుతూ, మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త మహేష్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. మహేష్ కుదరదనడంతో మనస్థాపం చెంది, జ్వరానికి తెచ్చుకున్న మాత్రలు ఒకేసారి మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు.

సారా విక్రేత అరెస్ట్