
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు–తాడిపత్రి రహదారిపై ఓ లారీ భీబత్సం సృష్టించింది. వేగంగా వస్తూ రహదారిపై వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. వాటిని మేపే ఇద్దరు గొర్రెల కాపరులపై వెళ్లడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 15 గొర్రెలు మృతి చెందాయి. ఎస్‌ఐ రామకృష్ణ వివరాల మేరకు.. నంద్యాల జిల్లా అళ్లగడ్డ తాలూకా నల్లవాగుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు(45), ఆలమూరు గ్రామానికి చెందిన నరసింహులు(35) తమ యజమాని క్రిష్ణయ్యకు చెందిన గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి గండికోట ప్రాంతంలో గొర్రెలు మేపి స్వగ్రామానికి యజమాని క్రిష్ణయ్యతో కలిసి బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డులో వెనుకవైపు నుంచి అతి వేగంగా గుర్తుతెలియని లారీ దూసుకువచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరసింహులును ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. యజమాని క్రిష్ణయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 15 గొర్రెలు మృతిచెందడంతో దాదాపు రూ. 2.50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, మృతుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని క్రిష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బోరున విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
మృతిచెందిన వెంకటేశ్వర్లు, నరసింహులు

గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ

గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ