
ఒంటిమిట్టలో విష జ్వరాలు
జ్వారాలు బెంబేలెత్తిస్తున్నాయి..
వాతావరణ మార్పులే కారణం...
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలో విష జ్వరాలతో ప్రజలు కుదేలవుతున్నారు. ఈ సారి మునుపెన్నడూ లేని విధంగా ముసురు వర్షాలు పట్టుకోవడంతో వాతావరణంలో నెలకొన్న మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. కీటక, నీటి జనిత వ్యాధులు ప్రబలడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ఇంట్లో ఒకరికి వస్తే చాలు.....
విష జ్వరాలు కారణంగా కుటుంబంలో ఒకరు జ్వరం బారిన పడితే చాలు ఆ ఇంటిల్లిపాదికి జ్వరాలు సోకుతున్నాయి. ముందుగా జలుబు, మళ్లీ దగ్గు, ఆ తరువాత ఒళ్లునొప్పులు ప్రారంభమై జ్వరానికి దారితీస్తున్నాయి.
జ్వరం అని వెళ్తే జేబులు ఖాళీ చేస్తున్నారు...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికి జ్వరం తగ్గకపోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. అక్కడ జ్వరం అని వెళ్తే ఆ టెస్టులు ఈ టెస్టులు అని రోగుల వద్ద జేబులు ఖాళీ చేస్తున్నారు.
టైపాయిడ్ అని వెళ్తే మలేరియా ఇంజక్షన్..
ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల పరిధిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒంటిమిట్ట ప్రజలు రోగాలకు చికిత్స చేయుంచుకుంటూ ఉంటారు. కొంత మంది టైపాయిడ్ జ్వరం అని వెళ్తే అక్కడి డాక్టర్లు మలేరియా, టైపాయిడ్‌కి సంబంధించిన రెండు ఇంజక్షన్లు రోగులకు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు రోజులకు ఇంజక్షన్లు రాసిస్తే ఆ ఐదు రోజులు తమ వద్దనే వేయించుకోవాలని, వేరే ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేయించుకోకూడదని కండీషన్లు కూడా పెడుతున్నారు. ఇలా ప్రజల రోగాలను వ్యాపారంగా మార్చుకునే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పెరిగిన బాధితులు.....
ఒంటిమిట్ట మండలంలో విష జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న బాధితల సంఖ్య పెరిగింది. ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారి ఓపీ సంఖ్య 170 మందికి పైగా వచ్చేవారు. కానీ విష జ్వరాలు పెరగడంతో 170 నుంచి 300కు చేరింది. విష జ్వరంతో వచ్చిన వారితో ఆసుపత్రిలోని పడకలు నిండిపోతున్నాయి. పడకలు చాలక సైలెన్ ఎక్కించుకునేవారు కుర్చీలోనే కూర్చొని సైలెన్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. వర్షాలకు పరిసరాలు అపరిశుభ్రత కారణంగా దోమలు వ్యాప్తి చెందడంతో విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒంటిమిట్ట పీహెచ్‌సీలో ఈనెల 9 వరకు నమోదైన కేసులలో వైరల్ ఫీవర్ 100కు పైనే, టైపాయిడ్ 29 కేసులు నమోదయ్యాయి.
రోగులతో కిటకిటలాడుతున్న
ఆసుపత్రులు
ఒంటిమిట్ట పీహెచ్‌సీలో రోగులతో నిండిన పడకలు, ఒంటిమిట్ట పీహెచ్‌సీలో వైద్యాధికారి గది వద్ద బారులు తీరిన రోగులు
నా కొడుకులు ఇద్దరికి టైఫాయిడ్ జ్వరా లు వచ్చాయి. వారికి రెండు రోజుల పా టు ఒంటిమిట్ట ప్రైవేటు ఆసుపత్రుల్లో వై ద్యం చేయించాను. అయినా తగ్గక పోయే సరికి వారిని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాను. కేవలం నా కొడుకులకే కాదు ఒంటిమిట్టలో చాలా మందికి జ్వరాలు వచ్చాయి. చిన్నపిల్లలు, పెద్దలు చేతికి సైలెన్ పెట్టుకుని అవస్థలు పడుతు న్నారు. అధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందించాలి.
– ఏలేశ్వరం మధుమూర్తి, ఒంటిమిట్ట గ్రామస్తులు
వాతావరణ మార్పుల వల్ల విష జ్వరాల ప్రభా వం అధికంగా ఉంది. అయినా రోగులు ఆందో ళన చెందాల్సిన పనిలేదు. చికిత్స తీసుకుంటు న్న వారు త్వరగా కోలుకుంటున్నారు. రోగులు మందులు వాడటంతోపాటు రోగ నిరోధక శక్తి పెంపొందించే పండ్లు, ఆకుకూరలు, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, డ్రాగన్, కెవీ పండ్లు రసాలు శ్రేయస్కరం. కాచిన నీరు తాగాలి. విషజ్వరాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
– డాక్టర్ భావన, ఒంటిమిట్ట పీహెచ్‌సీ వైద్యాధికారి

ఒంటిమిట్టలో విష జ్వరాలు

ఒంటిమిట్టలో విష జ్వరాలు