
వాటర్‌షెడ్‌లో నిధుల దుర్వినియోగం
● కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు
● పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వాటర్‌షెడ్ చైర్మన్
పెద్దతిప్పసముద్రం : మండలంలోని మడుమూరు పంచాయతీలో వాటర్‌షెడ్ ద్వారా జరుగుతున్న పనులు, నిధుల దుర్వినియోగంపై వాటర్‌షెడ్ చైర్మన్ మొరుంపల్లి శ్రీనివాసులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సంపతికోట మైక్రో వాటర్‌షెడ్ పరిధిలోని మడుమూరు పంచాయతీలో డకోట పాండ్స్, ఎంపీటీ లాంటి పనులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారన్నారు. చెరువులు, ఏరు లాంటి ప్రదేశాల్లో పనుల నిషేధం ఉన్నా వాటర్‌షెడ్ సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారన్నారు. అంతేగాక చెరువులోనే ఒకే చోట పనికి, మరో పనికి మధ్య కేవలం 30 మీటర్ల దూరంలోనే మూడు డకోట పాండ్స్ పనులు చేపట్టడం నిధుల దుర్వినియోగానికి అద్దం పడుతోందన్నాడు. వాటర్‌షెడ్‌లో పని చేసే ఇద్దరు సిబ్బంది పనుల మంజూరు కోసం తన వద్ద ఆరు సంతకాలు పెట్టించుకున్నారన్నాడు. అదే విధంగా దొడ్డిదారిలో బిల్లులు చేసుకునే నేపథ్యంలో, మరిన్ని సంతకాల కోసం తనతో పాటు కమిటీ సభ్యులను సైతం వెంటపడి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ప్రజలకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన పనులను అధికారులు లోపాయికారి ఒప్పందాల కారణంగా నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారని ఆరోపించాడు. ఇటీవల కాలంలో పక్క మండలానికి చెందిన ఓ వ్యక్తికి, స్థానికంగా ఉన్న పలువురికి పనుల విషయంలో ఘర్షణ జరగ్గా స్థానికేతరుడికి రక్త గాయాలు అయినట్లు పేర్కొన్నాడు. వాటర్‌షెడ్‌లో ప్రజాధనం దుర్వినియోగానికి కారకులైన అధికారుల నుంచి నిధులను రికవరీ చేయించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తాను కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్లు తెలిపాడు.