
డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా
మదనపల్లె సిటీ : మెగా డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా నుంచి మెగా డీఎస్సీలో ఎంపికై న వారిని గురువారం ఉదయం కడప ఆర్ట్స్ కాలేజీ చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. అక్కడి నుంచి విజయవాడలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి తీసుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీంతో నాన్ లోకల్ కింద ఎంపికై న వారు సుదూర ప్రాంతాల నుంచి కడపకు చేరుకున్నారు. ఉద్యోగం కావాలంటే నీవే కాదు తోడుగా ఒకరిని తప్పక తీసుకురావాల్సిందేనని ఆదేశించారు. దీంతో చిన్నపిల్లల తల్లులు, గర్భవతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఎంతో వ్యయపయాసాలకు ఓర్చి వెళితే వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చేసేది లేక అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు.
చదవలేదని పంపేశారంటూ విద్యార్థి ఫిర్యాదు
మదనపల్లె రూరల్ : చదువురాని విద్యార్థులు పాఠశాలకు అక్కర్లేదని వివేకానంద హైస్కూల్ హెచ్‌ఎం రాజేంద్రబాబు తనను పాఠశాల నుంచి పంపేశారని పదోతరగతి విద్యార్థి లోకేష్ తల్లిదండ్రులతో కలిసి సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణికి ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట హెచ్‌ఎం రాజేంద్రబాబు తీరుపై తల్లిదండ్రులు, బీఎస్పీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పది మంది విద్యార్థులను చదువులో వెనుకబడ్డారని దుర్భాషలాడి హెచ్‌ఎం ఇంటికి పంపేశారన్నారు. తాము వెళ్లి హెచ్‌ఎంను నిలదీయడంతో చదువురాని విద్యార్థులు పాఠశాలకు వద్దని అసభ్యంగా తిట్టారన్నారు. తమ బిడ్డల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. హెచ్‌ఎం రాజేంద్రబాబు వివరణ ఇస్తూ... ఆగస్టు 13వ తేదీ నుంచి లోకేష్ పాఠశాలకు రాలేదని, తల్లిదండ్రులకు విషయం తెలిపినా పట్టించుకోలేదన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రాకుంటే పాస్ కాలేరని మాత్రమే చెప్పానని, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెపల్లె బాలాజీ, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలి
రాయచోటి టౌన్ : దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో రూ.3వేలు ఉన్న పెన్షన్‌ను కూటమి ప్రభుత్వం రూ.6వేలకు పెంచిందన్నారు. రూ.10 వేలుగా ఉన్న పెన్షన్ రూ.15 వేలకు పెంచడంతో దివ్యాంగుల కుటుంబాలు ఎంతో సంతోషించారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏవో సాకులు చూపుతూ సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం బోగస్ సర్టిఫికెట్లు తొలగించమని చెప్పితే వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా అర్హత కలిగిన వారందరినీ తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు.
మట్టిని తవ్వి.. అక్రమంగా తరలిస్తూ
పకృతి సిద్ధంగా లభించిన మట్టిని కూటమి నేతల అండతో జేసీబీలు, ఇటాచీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. లక్షల రూపా యల మట్టి దోపిడీ చేస్తున్న వారిని అధికారులు నిలువరించలేకపోతున్నారు. సంబేపల్లి మండలం గుట్టపల్లె వద్ద పట్ట పగలే ఇలా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గురువారం మట్టి రవాణాను అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్రమంగా మట్టి తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. – సంబేపల్లె

డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా

డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా

డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా