నేడు వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరు | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరు

Sep 9 2025 8:15 AM | Updated on Sep 9 2025 4:02 PM

●నేడు వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరు

●నేడు వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరు

ఎరువుల కోసం అన్నదాతకు తప్పని తిప్పలు

నేడు రైతు సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరుబాట

సాక్షి, రాయచోటి : అన్నదాతకు అనుక్షణం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు ప్రకృతి అల్లకల్లోలం చేస్తే, మరోవైపు ప్రభుత్వం కష్టాలు చూపిస్తోంది. పంటలు పండక... చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతు కుంగిపోతున్నాడు. అయితే ఆపదలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇప్పటికీ చేష్టలుడిగి చూస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రతిసారి విత్తనం మొదలు..కాయ కోసే వరకు అగచాట్లు తప్పడం లేదు. పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర లేక పండ్ల తోటరైతుల బాధలు వర్ణణాతీతం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ పూర్తిగా కరువు బారిన పడింది. అయితే ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్న అన్నదాతకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించే పరిస్థితి కనిపించడం లేదు. వరితోపాటు ఇతర పంటలకు వినియోగించే యూరియా సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల క్యూలైన్లలో నిలబడినా ప్రయోజనం లేకపోవంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి సుమారు 1,30,000 ఎకరాల వరకు పంటలు సాగు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం పది వేలలోపు మాత్రమే పంటలు సాగయ్యాయి. అది కూడా అరకొరగా వేరుశనగ, మినుము, వరి, జొన్న, పత్తి, కంది పంటలు సాగయ్యాయి. అయితే జిల్లాలో అధికంగా సాగయ్యే పంటల్లో ప్రధానంగా వేరుశనగ కాగా, వరిది రెండవస్థానం. అయితే విపత్కర పరిస్థితుల పుణ్యమా అని పంట సాగే కష్టంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రత్యామ్నాయం దృష్టి సారించిన అన్నదాతల మీద ఎరువుల బారం పడుతోంది. యూరియా అంతంత మాత్రంగా ఉండగా, మరోప్రక్క అనేక రకాల ఆంక్షలతో రైతులకు అందడం గగనంగా మారుతోంది. మొదట్లో డీఏపీ, ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలికపెట్టిన వ్యాపారులు, తర్వాత అధికారుల ఒత్తిడితో కొంతమేర తగ్గారు. అయితే మొదట్లో అధిక ధరలకు కూడా విక్రయాలు సాగాయి. ప్రస్తుతం యూరియా కోసం పలుచోట్ల బారులు తీరుతున్నారు.

కరువులతో కకావికలం

జిల్లాను కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. 2024లోనూ కొంతమేర వర్షం పడటం, ఆ తర్వాత పడకపోవడంతో వేసిన పంటలు నిలువునా ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఈసారి ఏకంగా వర్షపు ఛాయలు దరిదాపుల్లో కనిపించలేదు. ఆకాశం మేఘావృతం కావడం....తూతూ మంత్రంగా తుపాను జల్లులతో పదునుకే కష్టమై పోయింది. దీంతో అదును దాటుతున్నా పదును వర్షం కోసం ఎదురుచూసి విసిగిపోయారు. కానీ పదును లేదు...విత్తనం పడింది లేదు...దీంతో ఎక్కడ చూసినా బీడు భూములు దర్శనమిస్తున్నాయి.

పండ్ల తోటల రైతులకు దొరకని గిట్టుబాటు

జిల్లాలో మామిడి, బొప్పాయి, టమాటా, కర్బూజ, అరటి పంటలు విస్తారంగా సాగు చేస్తారు. అయితే రైతులకు ప్రతిసారి పంట పండించిన తర్వాత గిట్టుబాటు గగనంగా మారుతోంది. వాణిజ్య పంటలైన వేరుశనగ, ఇతర పంటలు కూడా గతంలో ధరలు లేక రైతులు అల్లాడిపోయారు. ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులు సతమతమవుతున్నారు. మొన్నటివరకు మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోగా, ప్రస్తుతం బొప్పాయి రైతులు భగ్గుమంటున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచేస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపండ్ల తోటల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైతులకు సకాలంలో యూరియాతోపాటు మిగతా ఎరువులు అందించడంలో కూటమి సర్కార్‌ విఫలమైన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సంకల్పించింది. ప్రధానంగా రైతులకు అవసరమైన ఎరువులు అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాటకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు నియోజకవర్గాలు, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్న తరుణంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జాతీయ రహదారి వద్ద నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలు పోస్టర్ల ఆవిష్కరణ చేపట్టి రైతులను భారీగా తరలి రావాలని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రాయచోటి కలెక్టరేట్‌కు చేరుకోనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement