
నేడు మినీ ఉద్యోగమేళా
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన మినీ ఉద్యోగమేళాను నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీ అయిన కడపకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్‌వైజర్, హెచ్‌ఆర్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిర్వాహకులు తెలియజేశారు. ఉద్యోగంలో చేరిన వారు ఐదు సంవత్సరాల బాండ్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు సమ్మతించినవారు మాత్రమే హాజరు కావాలని చెప్పారు.
ఉత్తమ ఇంజినీరింగ్
కళాశాలగా గుర్తింపు
కురబలకోట: రాష్ట్రంలో ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ప్రతినిధి యువరాజ్ మంగళవారం తెలిపారు. ఇండియన్ సొసైటీ ఫఽర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఈ కళాశాల విద్యార్థిని కాగిత భార్గవికి రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా, బీటెక్ విద్యార్థి కార్తీక్ కోవికి ఉత్తమ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా అవార్డులు దక్కినట్లు తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు
నందలూరు: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్‌పిళ్లై, ఎంపీడీఓ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రజల చేతిలో ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సచివాలయంలో నిర్వహించిన పీ–4 గ్రామసభలో వారు మాట్లాడుతూ మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుందని అన్నారు. వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా 200 పథకాల గురించి అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. నాగిరెడ్డిపల్లె, నందలూరు సచివాలయాల్లో ఇప్పటి వరకు 100 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి బండ్ల సురేష్‌కుమార్, వెంకటరమణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
రుణ ప్రణాళికపై అవగాహన
వీరబల్లి్: రుణ ప్రణాళికలపై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బండి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా తమ జీవనోపాధుల ఏర్పాటుకు ఎంతో రుణం కావాలని, దానికి సంబంధించిన వివరాలు యాప్‌లో బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయనున్నట్లు చెప్పారు. వివరాలన్నీ బ్యాంకు మేనేజర్ లాగిన్‌కు వెళ్తాయన్నారు. సంఘం ద్వారా తీసుకున్న అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా వెళ్తాయని తెలిపారు. పలు విషయాలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు వెంకటరమణ, లీగల్ కో–ఆర్డినేటర్ ఆనందబాబు, స్థానిక ఏపీఎం ఖాదర్ వల్లి, సీసీఎల్ కృష్ణయ్య, సుధాకర్, గంగాధర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా పీ4 అమలు
రాయచోటి: పీ–4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈనెల 19 నుంచి పీ– 4 అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలకు మెరుగైన తోడ్పాటు ఇచ్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలుగా నమోదైన వారికి చేయూతను ఇవ్వడం కోసం ఆగస్టు 15లోగా మార్గదర్శకుల నమోదు పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలకు సంబంధించి పలు సూచనలు కలెక్టర్ జారీ చేశారు.

నేడు మినీ ఉద్యోగమేళా