
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు. పలువురు వ్యాపారుల వద్ద వేరుశనగ కాయలు తెచ్చి వ్యాపారం సాగించాడు. అప్పుల భారంతో మంగళవారం ఉదయం తన మిల్లులోనే విష గుళికలు మింగాడు. పరిస్థితి విషమించడంతో అతనిని స్థానిక హోమస్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్ద ఓబుళరెడ్డి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తనపై జరిగిన దాడి సంఘటనను పెన్నుతో చేతిలో రాసుకున్నట్లు గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.