
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన షకీలా(35) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమార్తెకు వివాహం చేసింది. ఈ క్రమంలో రెండురోజుల కిందట ఇంటికి వచ్చిన కుమార్తెతో కుటుంబ సమస్యలపై మంగళవారం గొడవపడింది. అనంతరం మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పురిటి బిడ్డకు పునర్జన్మ
సుండుపల్లె : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో 11 రోజుల పురిటి బిడ్డకు ప్రాణం పోశాడు డాక్టర్ దిలీప్ గుప్తా. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం గ్రామంలో 11 రోజుల చిన్న బిడ్డకు స్నానం చేయిస్తున్న సమయంలో పొరపోయింది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక ప్రాణాపాయస్థితిలో బిడ్డ అల్లాడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే పాపను సుండుపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దిలీప్ గుప్తా, ఫర్హాఖానం వైద్యం అందిచారు. బిడ్డ ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదించారు.తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
8న అండర్–22 క్రీడల పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకొని శాప్ అదేశాల మేరకు ఈ నెల 8న అండర్–22 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ వెయిట్ లిప్టింగ్(అన్ని విభాగాలు) పోటీలు, డీఎస్‌ఏ స్టేడియంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి విభాగంలో విజేతగా నిలిచి ఎంపికై న జట్టు తిరుపతిలో ఈ నెల 11వతేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న జోనల్‌స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బెల్డ్ షాపులపై పోలీసుల దాడులు
లింగాల : మండలంలోని గుణకణపల్లెలో బెల్టు షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన లోమడ శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించి 12 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులును అరెస్టు చేశామని హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం