
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆగష్టు 18వ తేదీ నుంచి కళాశాలలో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని తెలిపారు. జిల్లాలో, జిల్లా బయట ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగష్టు 21 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ పత్రాల పరిశీలన, 21 నుంచి 24వ తేదీవరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు, 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాల బోధన, బోధనేతర సిబ్బందిచే విద్యార్థుల కోసం కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగష్టు 27న సీట్లను కేటాయిస్తారని, 28వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు.