
నిత్యపూజ స్వామి తలనీలాల వేలం పాట
సిద్దవటం: శ్రీ నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన నాగయ్య రూ. 5.10 లక్షలకు దక్కించుకున్నారని ఈఓ శ్రీధర్ తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి ఆలయంలో తలనీలాల హక్కు కోసం మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, సిద్దవటం ప్రాంతాలకు చెందిన ఆరుగురు పాటదారులు పాల్గొన్నారని ఈఓ తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో తాత్కాలిక షాప్‌లకు నిర్వహించిన వేలం పాటను సిద్దవటం ఎగువపేటకు చెందిన కూనా విజయభాస్కర్ రూ.1,43,000 దక్కించుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజంపేట దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జనార్దన్, ఆలయ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా వైఎస్‌ఆర్ కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొండాపురంలో అత్యధికంగా 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 10.6 మి.మీ, లింగాలలో 9.2, జమ్మలమడుగులో 4.2, మైలవరంలో 3.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.