
ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని వైఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిలు పార్టీలోకి రావాలని సముదాయించేందుకు ప్రయత్నించారన్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్ చేస్తే విశ్వనాథరెడ్డి ఫోన్ ఎత్తలేదని.. ఈ మాత్రానికే బెదిరించినట్లు కేసుపెట్టడం దారుణమన్నారు. వైఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐని కోరుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి మాట్లాడటాన్ని బట్టి చూస్తే వారి కుట్ర బయటపడుతోందన్నారు. ఆచ్చివెళ్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిని బలవంతంగా టీడీపీలో చేర్చుకున్రాని దళితులు చెబితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు తెరతీశారన్నారు. ఈకార్యక్రమంలో షేక్ షఫీ, బి.సుబ్బరాయుడు, ఎన్.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.