
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు. వృత్యంతర శిక్షణలో భాగంగా కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో కేజీబీవీల ఉపాధ్యాయులకు మంగళవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయినులు యోగాపై అవగాహన పెంచుకుని కేజీబీవీ విద్యార్థినులకు నేర్పించాలన్నారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానందరాజు మాట్లాడుతూ యోగా నిర్వహించడంతో శారీరక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి ఉపాధ్యాయినులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, అఖిల్, అనూష, వింధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.