
హెచ్‌పీసీఎల్ ప్లాంట్ సిబ్బందికి అవగాహన
సిద్దవటం : పరిశ్రమలకు బాంబు బెదిరింపులు వచ్చినపుడు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కడప ఏఆర్ అడిషనల్ ఎస్పీ రమణయ్య సూచించారు. మండలంలోని భాకరాపేట సమీపంలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) ప్లాంట్ సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించి.. మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎప్పీ రమణయ్య మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల సమయంలో ఉద్యోగుల అప్రమత్తత పెంచేందుకు ఈ మాక్‌డ్రిల్ ఉపయోగ పడుతుందన్నారు. భద్రతా ప్రమాణాలు, చర్యలపై అవగాహన కల్పించడంతో మాక్ డ్రిల్ సమయంలో ప్లాంట్ నుంచి సురక్షితంగా ఖాళీ చేయించగలిగామన్నారు. పరిసర భద్రతా బాంబు స్క్వాడ్ సమన్వయంతో సిబ్బంది, భద్రతా బృందాలు చక్కగా పనిచేశాయని అధికారులు అభినందించారు. ఈ మాక్ డ్రిల్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, కడప పరిశ్రమల శాఖ భద్రతాధికారి సతీష్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇన్‌చార్జి శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు.