
● ఫ్యాక్టరీల వద్ద ఎదురుచూపులు
పీలేరు తలుపుల వద్ద రోడ్డు వారగా మామిడి కాయలను పారబోసిన దృశ్యం
సాక్షి రాయచోటి: మామిడి రైతులకు ఈసారి కష్టం..కన్నీరే మిగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులతో రైతు కుదేలయ్యాడు. మామిడి రైతును ఆదుకుంటామని పైకి ప్రగల్భాలు పలికిన కూటమి సర్కార్ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. తోతాపురి మామిడి పంటకు సంబంధించి కాయలు అడిగే వ్యాపారులు లేకపోగా...గుజ్జు ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లినా కిలో రూ. 4–5లకు అడుగుతుండడంతో గిట్టుబాటు కాదని మామిడి రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. గతంలో ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళితే కనీసం టన్నుకు రూ. 750 చొప్పున రవాణా ఛార్జీలు ఇచ్చేవారు. అవి కూడా లేకుండా ఇప్పుడు కేవలం టన్నుల ప్రకారం తీసుకుంటుండడంతో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణంగా ప్రతి ఏడాది మార్చిలో సీజన్ ప్రారంభమై జులై చివరి నాటికి ముగుస్తుంది. అయితే ఈసారి ప్రకృతి దెబ్బతీయడంతో పంట సరిగా రాక అల్లాడి పోతున్న తరుణంలో ధరలు కూడా పతనం కావడంతో కొంతమంది రైతులు ఏకంగా రోడ్లపై పారబోస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక....
జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి. జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్టలో మామిడిని సాగు చేశారు.ప్రధానంగా లాల్‌బహార్, బేనీషా, ఖాదర్, తోతాపురి, ఇమామ్ పసంద్, చెరుకు రసం, సువర్ణ రేఖ, దసేరి, మలుగ్బా తదితర రకాలు సాగు చేశారు. అయితే ప్రస్తుతానికి అన్ని రకాలకు సంబంధించిన దిగుబడులు ముగుస్తున్నాయి. అంతో ఇంతో బేనీషా, నీలం, తోతాపురి (బెంగుళూరు) లభిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు లేకపోవడంతో తోతాపురిని అడిగే వారే లేకపోయారు. లోకల్‌గా రూ 3–5 మధ్య కిలో ధర పలుకుతోంది. అప్పటికీ టన్ను రూ. 3–5 వేలు మాత్రమే కనిపిస్తుండడంతో ఎంతమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పొలాల మీదనే వదిలేస్తున్నారు. కొంతమంది చెట్లకు బరువు వద్దని రోడ్డు వారగా పారవేస్తున్నారు. ప్రభుత్వం అదనంగా రూ. 5 పెంచి ఇస్తామన్న ఇప్పటివరకు అతీగతీ లేని పరిస్థితుల్లో అన్నదాతలు ఆవేదనలో మునిగిపోయారు. వైఎస్సార్ సీపీ హయాంలో గిట్టుబాటు ధరలుబాగా ఉండడంతో మామిడి రైతులు పంటను విక్రయిస్తూ వచ్చారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భాలు లేవని రైతులు పేర్కొంటున్నారు.
తోతాపురి టన్నుకు రూ 4–5 వేలలోపే
కోయడానికి ఇష్టం లేక తోటల మీద వదిలేస్తున్న వైనం
మామిడి రైతులను పట్టించుకోని కూటమి సర్కార్
వైఎస్సార్ సీపీ హయాంలో ధరలతోపాటు దిగుబడులు ఆశాజనకం
మామిడి సాగు చేసిన రైతులు చివరకు ఖర్చుకై నా వస్తుందని ఆశించి...తోటలో ఉన్న దిగుబడిని ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళితే అక్కడ నిరీక్షణ తప్పలేదు. ఎందుకంటే ఫ్యాక్టరీలు తక్కువగా ఉండడం..చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి చిత్తూరులోని గుజ్జు పరిశ్రమలకు కాయలు వస్తున్నాయి. దీంతో ఫ్యాక్టరీ వారు టోకెన్లు ఇచ్చి తీసుకుంటుండడంతో రోజుల తరబడి కాయలను విక్రయించేందుకు వేచి ఉండాల్సి వస్తోంది. ఫ్యాక్టరీల వద్ద కూడా ఎదురుచూసే పరిస్థితి రావడంతోనే అక్కడికి తీసుకు వెళ్లేందుకు కూడా రైతులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.