
పీఎం సూర్యఘర్ యోజనను సద్వినియోగం చేసుకోండి
రాయచోటి : ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ జానకీ రామ్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలోని సాయి శుభ కళ్యాణ మండపంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాయచోటి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు, ఉద్యోగులు, కార్మికులతో ముఖాముఖి నిర్వహించి సెక్షన్‌ల వారిగా పథకంపై సమీక్ష చేపట్టారు. మండల అధికారులకు ఆ సెక్షన్‌లో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సూర్యఘర్ యోజనకు సంబంధించిన కాంట్రాక్టర్లతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వలన కరెంటు బిల్లును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేయవచ్చన్నారు. ఒకసారి పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్ అమర్చుకోవడం ద్వారా 25 సంవత్సరాలపాటు సున్నా కరెంటు బిల్లుతో సంతోషంగా జీవించవచ్చన్నారు. ఈ పథకానికి బ్యాంకు ఏడుశాతం వడ్డీతో 90 శాతం రుణం ఇస్తుందన్నారు. సోలార్ ప్లాంట్ అమర్చేవారికి ఒక కిలోవాట్స్ రూ.30వేలు, రెండు కిలో వాట్స్‌ను రూ.60వేలు, మూడు కిలో వాట్స్‌కు రూ. 78 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ ప్లాంట్ అమర్చుకునే బీసీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.చంద్రశేఖర్ రెడ్డి, విద్యుత్ శాఖ రాయచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చాంద్‌బాషా, విజయ్ కుమార్ రెడ్డి, నాగమునిస్వామి, అధికారులు, సిబ్బంది, వినియోగదారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.