
వివాహిత హత్య కేసులో నలుగురి అరెస్టు
పీలేరు రూరల్ : వివాహిత హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి దంపతుల కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్‌రెడ్డి కుమారుడు వరంపాటి విజయశేఖర్‌రెడ్డితో వివాహమైంది. విజయశేఖర్‌రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతనెల 28న రాత్రి ఇందుజాను హతమార్చాలని విజయశేఖర్‌రెడ్డి, తన తల్లి శాంతమ్మ, అక్క సునంద, అవ్వ కంభం అమ్మన్నమ్మలతో కలిసి పథకం పన్నాడు. ఆ రోజు రాత్రి పక్క గ్రామంలో గంగజాతర ఉండడంతో గ్రామస్తులు ఎవరూ లేని సమయం చూసుకుని పథకం ప్రకారం ఇందుజాను కొట్టి గొంతునులిమి హత్య చేశారు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించేందుగా సమీప వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేశారు. తన తల్లి సలహా మేరకు తిరిగి మృతదేహాన్ని ఇంటి వద్దకు చేర్చారు. ఇందుజా నిద్రలోనే మృతి చెందినట్లు ప్రచారం చేశారు. మృతురాలి తల్లి జీవనజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలికి తీశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ యుగంధర్, ఎస్‌ఐ లోకేష్ పాల్గొన్నారు.