
ద్విచక్రవాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో జరిగింది. పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీకి చెందిన నాగరాజు కుమారుడు కిషోర్ (29) ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా క్రిష్ణాపురం జ్యూస్‌ఫ్యాక్టరీ వద్ద మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ..
నిమ్మనపల్లె : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మండలంలో జరిగింది. సోమల మండలం కందూరు పంచాయతీ చెరుకువారిపల్లెకు చెందిన సతీష్‌రెడ్డి భార్య సుజాత (35) కుమారుడిని మదనపల్లె పట్టణం వివేకానందనగర్‌లో ఉంటున్న పుట్టింటిలో వదిలి వెళ్లేందుకు ద్విచక్రవాహనంలో వచ్చింది. తిరిగి ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
కరెంటు షాక్‌తో..
మదనపల్లె రూరల్ : కరెంటు షాక్‌కు గురై మహిళ గాయపడిన సంఘటన శనివారం పుంగనూరు మండలంలో జరిగింది. కృష్ణాపురం గ్రామానికి చెందిన శివకుమార్ భార్య తులసీ (35) ఇంటి ముందు ఉన్న కమ్మిపై బట్టలు ఆరేస్తుండగా సమీపంలోని సర్వీసు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురైంది. ప్రమాదంలో ఆమె గాయపడగా కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
మదనపల్లె : తంబళ్లపల్లెలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన శనివారం రాత్రి పరసతోపు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఏటిగడ్డపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ(66) దినసరి కూలితో జీవనం సాగిస్తాడు. ఇంటి నుండి భోజనం చేసి మామిడి కాయలతోపునకు కాపలా నిమిత్తం పరసతోపు వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లోకేష్ రెడ్డి వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మదనపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
మృతి చెందిన అఘోరి
కృష్ణానంద భారతి పరమహంసగా గుర్తింపు
చిట్వేలి : చిట్వేలి మండల పరిధిలోని గుండాలకోన గుండంలో పడి శుక్రవారం మృతి చెందిన అఘోరిని శ్రీకృష్ణానంద భారతి పరమహంస(33)గా గుర్తించినట్లు రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. అఘోరికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె చిన్న వయస్సులోనే యూకే లండన్‌లో నివసించి ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ సత్యాన్వేషణ చేశారు. తన సంపాదన అంతా దానధర్మాలు చేసి భారతదేశం వచ్చి విజయనగరం జిల్లా గుర్లమండలం, పున్నపురెడ్డిపేట శ్రీ సిద్దయోగాశ్రమం, బ్రహ్మర్షి లక్ష్మణానంద స్వామి వద్ద సిద్ధ విద్య స్వీకరించారని ఆశ్రమ కార్యనిర్వాహక సభ్యుడు పవన్ కుమార్ తెలిపారు. అఘోరి గుండాల కోన గుండం పై భాగంలో ధ్యానం చేస్తూ కాలు జారి గుండంలో పడి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. భౌతిక కాయాన్ని ఆశ్రమ సభ్యుడు పవన్ కుమార్‌కు శనివారం మధ్యాహ్నం అప్పగించినట్లు సీఐ తెలిపారు.
టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణ
తంబళ్లపల్లె : స్థానిక టీఎన్.వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ హబ్ సెంటర్ ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, కో ఆర్డినేటర్ చౌడయ్య తెలిపారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారని, 15 సంవత్సరాలకు పైబడి 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 29వ తేదీ లోపు ఐటీఐ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9618655759లో సంప్రదించాలన్నారు.

ద్విచక్రవాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు