
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి, కుటుంబాన్ని తనతోపాటు తీసుకెళ్లాలని స్వగ్రామానికి వచ్చిన వ్యక్తి, విధి వక్రించి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి తంబళ్లపల్లె మండలంలో జరిగింది. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ గోనెపోతులవారిపల్లెకు చెందిన సిద్ధప్పనాయుడు, రెడ్డెమ్మ దంపతుల కుమారుడు జి.శేషప్పనాయుడు(31), ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం తన కుటుంబాన్ని అక్కడికే తీసుకెళ్లాలని స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో తన భార్య లక్ష్మీ అపర్ణ తల్లి ఈశ్వరమ్మకు అనారోగ్యం కావడంతో మదనపల్లెలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించగా, శేషప్పనాయుడు ఆస్పత్రికి వచ్చి ఆమెను చూసి తిరిగి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి రాత్రివేళలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని తంబళ్లపల్లె మండలం రెడ్డికోట పంచాయతీ కుక్కరాజుపల్లె క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ప్రమాదంలో శేషప్పనాయుడుకు తీవ్ర గాయాలై, కొన ఊపిరితో ఉండగా గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అవుట్‌పోస్ట్ సిబ్బంది తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. శనివారం పోస్టుమార్టం పూర్తయిన అనంతరం శేషప్పనాయుడు మృతదేహాన్ని తంబళ్లపల్లె ఎస్‌ఐ లోకేష్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శేషప్పనాయుడుకు చంద్రశేఖర్‌నాయుడు(10), మల్లిక(08) ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితంలో స్థిరపడి, కుటుంబాన్ని తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లి సంతోషంగా జీవించాలనుకున్న శేషప్పనాయుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
మృతుడు 20 రోజుల క్రితం కువైట్ నుంచి రాక