
రాజంపేటలో.. తమ్ముళ్ల రాద్ధాంతం
రాజంపేట తమ్ముళ్లలో ఇన్‌చార్జి గోల మళ్లీ మొదలైంది. శుక్రవారం టీడీపీ నేత చమర్తి జగన్‌మోహన్‌రాజు రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జి అంటూ సోషల్ మీడియా, మీడియా గ్రూపులలో ప్రచారం జరిగింది. దీంతో నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌లో విభేదాలు భగ్గుమన్నాయి.
రాజంపేట : రాజంపేట ఇన్‌చార్జి నియామకంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. శుక్రవారం వ్యూహాత్మకంగా చమర్తిని ఇన్‌చార్జిగా నియమించారంటూ పార్టీ క్యాడర్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీంతో ఆ పార్టీ క్యాడర్‌లో కొందత గందరగోళం మొదలైంది. కడప మినీ మహానాడు నేపథ్యంలో రాజంపేటలో గురువారం జరిగిన సభలో పరిశీలకుడు దుర్గాప్రసాద్ తాత్కాలిక సమన్వయకర్తగా చమర్తి జగన్‌మోహన్ రాజు పనిచేస్తారని తెలిపారు. దానిని చమర్తి వర్గీయులు రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జి అంటూ తమ క్యాడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వైరివర్గ నేతలు ఇన్‌ఛార్జిగా చమర్తిని ఎలా నియమిస్తారంటూ రగిలిపోయారు. దీంతో రాజంపేట టీడీపీలో ఇన్‌చార్జి నియామకం వ్యవహారం దుమారం లేపింది. ఇన్‌చార్జిగా ఇప్పటికీ ఎవరినీ నియమించలేదంటూ అదే పార్టీలోని వైరీవర్గ నేతలు సోషల్ మీడియా గ్రూపులు వేదికగా విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇన్‌చార్జిగా అధిష్టానం ఎవరినీ ఇంతవరకు నియమించలేదని కొందరు మాటల తుటాలు పేల్చుకున్నారు. చమర్తి ఇన్‌చార్జి అనగానే ఆయన సామాజికవర్గంలో సంతోషం వ్యక్తం కాగా, గత ఎన్నికలో పోటీ చేసిన ఓడిపోయిన సుగవాసిని కాదని చమర్తికి ఏవిధంగా ఇన్‌చార్జి ఇస్తారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. సుగవాసి సైలంట్‌గా ఉన్న నేపథ్యంలో ఇన్‌చార్జి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం కొలిక్కి తీసుకురాలేని పరిస్థితి పోతోంది.
మహానాడు జనం తరలింపు నేత ఎవరు..
టీడీపీలో వర్గ విభేదాలు పొడచూపడంతో కడపలో మహానాడుకు జనం తరలింపు ప్రశ్నార్ధకరంగా మారింది. పార్టీకి పెద్దదిక్కు ఎవరో తెలియని సంకటస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్‌ను మహానాడుకు మళ్లించాలంటే లక్షల రూపాయిల వ్యయం అవుతుంది. విభేదాల నేపథ్యంలో ఎవరూ ముందుకురాలేదని, చమర్తి జగన్‌మోహన్‌రాజుకు తాత్కాలిక సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడమే ఇందుకు కారణమనే చర్చ మొదలైంది. సీనియారిటికే ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు నేతలు నిరసన గళం విప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్యాడర్‌ను కాదని, కొత్తవారికి చోటు ఇచ్చే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో దర్జాగా అధికారం అనుభవించిన నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరిన నేపథ్యంలో మినీ మహానాడు వేదికగా సీనియర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలు కొత్త నేతలకు మింగుడుపడటం లేదు.
ఎటూ తేలని రాజంపేట టీడీపీ
ఇన్‌ఛార్జి నియామకం
తాత్కాలిక ఇన్‌ఛార్జిగా
చమర్తి ఉంటారని ప్రకటన
రగిలిపోయిన ప్రత్యర్థి వర్గ
టీడీపీ నాయకులు
మహానాడుకు జన తరలింపు ప్రశ్నార్థకం
గుడ్డి కన్నా మెల్ల మేలు
ఒంటిమిట్ట : టీడీపీ రాజంపేట తాత్కాలిక సమన్వయకర్తగా చమర్తి జగన్‌మోహన్‌రాజును ప్రకటించడంపై టీడీపీ ఒంటిమిట్ట సీనియర్ నాయకుడు కొమర వెంకటనరసయ్య చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. స్థానిక హరిత హోటల్‌లో విలేకరులతో టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకటనరసయ్య మాట్లాడుతూచమర్తి నియామకంపై గుడ్డి కన్నా మెల్ల మేలు అంటూ అతడు విలేకరుల సమావేశంలో వ్యంగాస్త్రం విసిరారు. తాత్కాలిక సమన్వయకర్తగా దమ్మున్న నాయకుడిని నియమించి ఉంటే బాగుండేదని మాట్లాడారు.

రాజంపేటలో.. తమ్ముళ్ల రాద్ధాంతం