
పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, రెండో భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆమెకు కుమారుడు సుమిత్(12), కుమార్తె లేఖన(6) ఉన్నారు. మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్‌తో బెంగళూరులో సహజీవనం చేస్తోంది. కాగా, అశోక్‌కు ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మౌనీషాతో వివాహమైంది. ఆమె ప్రస్తుతం గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉంది. కొద్ది రోజుల కిందట అశోక్‌కు కాలు విరగడంతో రాణి సాయంతో చికిత్స తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల సూచనతో రాణి బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాణికి ఫోన్ చేసిన అశోక్.. నన్ను వదిలి వెళ్లిపోతావా అంటూ గొడవ పడ్డాడు. దీంతో కుమార్తెతో కలిసి రాణి అశోక్‌ను కలుసుకునేందుకు రాగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహంతో రాణిపై అశోక్ చేయి చేసుకోవడంతో మనస్తాపం చెందింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న కోమటివానిచెరువు కట్ట సమీపంలోని రోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఏఎస్‌ఐ రమణ ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అశోక్‌ను తాను రెండో వివాహం చేసుకున్నానని, తనపై అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడని తెలిపింది. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.