
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
గుర్రంకొండ : పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని మర్రిమాకులపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్, సుమలతల కుమార్తె వర్షిత(16) స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివింది. పది పరీక్ష ఫెయిల్ కావడంతో గుర్రంకొండ తెలుగు జెడ్పీ హైస్కూల్‌లో గురువారం సప్లమెంటరీ పరీక్ష రాసేందుకు వచ్చింది. రాసిన అనంతరం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు గుర్రంకొండకు చేరుకొని వాకబు చేశారు. రెండు రోజులుగా విద్యార్థిని ఆచూకీ కోసం గాలించినా కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘరామ్ తెలిపారు.
370 లీటర్ల సారా ఊట ధ్వంసం
మదనపల్లె రూరల్ : బి.కొత్తకోట మండలంలో దాడులు జరిపి 370 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసినట్లు సీఐ భీమలింగ తెలిపారు. విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బి.కొత్తకోట మండలం సుబ్బిరెడ్డిగారిపల్లెలో ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారని తెలిపారు. జి.కృష్ణప్ప కుమారుడు జి.రవికుమార్(30), టి.సుబ్బయ్య కుమారుడు టి.ఆనంద్(34), అదే గ్రామానికి చెందిన కె.వెంకటరమణ(70)లు సారా విక్రయిస్తుండగా ఆరెస్టు చేశామన్నారు. వారి వద్ద పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు తయారీకి సిద్ధంగా ఉంచిన 370 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై వేర్వేరుగా కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపామన్నారు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.