
ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బద్వేల్–నెల్లూరు రోడ్డులోని దుకాణాల ఎదుట ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపాలిటీని ముండ మోపించేందుకే వచ్చాడంటూ టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. బద్వేల్ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ వివి.నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారి సతీష్, సిబ్బంది నరసయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న బోర్డులు, రేకుల షెడ్డులను తొలగించే పనులు చేపట్టారు. ఈ సమయంలో ఓ దుకాణం ఎదుట ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలు తొలగించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ మున్సిపాలిటీ నాయకుడు మిత్తికాయల రమణ అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చామని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా వారిపై చిందులేశాడు. అంతటితో ఆగకుండా ఈ కమిషనర్ బద్వేల్ మున్సిపాలిటీని ముండమోపించేందుకే వచ్చాడు.. నాశనం చేసి పోతాడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. మీరు మనుషులను తీసుకువచ్చి ఇలా చేయడం సరికాదని సిబ్బంది అనగా.. మనుషులను పంపిస్తే పరిస్థితి ఇలా ఉండదంటూ బెదిరింపులకు దిగారు. సిబ్బంది చేసేదిలేక ఆక్రమణల తొలగింపు నిలిపేసి వెనుదిరిగారు. జరిగిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగించారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని ఇష్టానురీతిలో మాట్లాడినప్పటికీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కొందరు ఉద్యోగులు చర్చించుకోవడం కనిపించింది.
మున్సిపల్ సిబ్బందితో టీడీపీ నేత వాగ్వాదం
కమిషనర్‌పై తీవ్ర పదజాలంతో
నేత ఆగ్రహం