
డేంజర్ జోన్‌లో క్వారీకి ఎలా అనుమతిస్తారు ?
పంటలు నష్టపోతున్నామని
గోవిందంపల్లి గ్రామస్థులు ఆగ్రహం
ఓబులవారిపల్లె : డేంజర్ జోన్‌గా ప్రకటించినప్పటికీ.. ఏపీఎండీసీ మంగంపేట గనికి 500 మీటర్ల దూరంలో కంకర క్వారీకి ఎలా అనుమతిస్తారని గోవిందంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం కా రణంగా తమ పంటలు నష్టపోతున్నామని మైన్స్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి శుక్రవారం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారితో మాట్లాడుతూ కంకర క్వారీలో నిర్వహించే భారీ పేలుళ్ల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, శ్వాసకోశ, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడి చాలామంది మృతి చెందారని ఆరోపించారు. తమ ఆస్తులు అమ్ముకున్నా ఆసుపత్రులకు సరిపోదని వారు వాపోయారు. గోవిందంపల్లి ప్రజలను కాపాడాలని, చర్య లు తీసుకోకపోతే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏడీ సుబ్రమణ్యం కంకర క్వారీ క్రషర్‌లను పరిశీలించి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రంమలో రామసుబ్రహ్మణ్యం, సింగ్, గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.