మదనపల్లె రూరల్ : టమాటా కోతలకు వచ్చిన కూలీలు పని చేయకుండా ఫోన్లు మాట్లాడుకుంటూ సమయం వృథా చేస్తుండటంతో.. ఆగ్రహం పట్టలేక యజమాని చితకబాదిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. సందిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యజమాని రమణ టమాటా పంట సాగు చేశాడు. పంట కోతలకు మదనపల్లె చంద్రాకాలనీకి చెందిన షబానా(22), ఆయిషా(26), మౌనిక(25), కనకమ్మ(30) కూలీ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో పనులు చేయకుండా వారు సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుండటంతో.. యజమాని రమణ వారితో వాగ్వివాదానికి దిగారు. ఆవేశంలో కూలీలను చితకబాదాడు. గాయపడిన కూలీలు, స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాడు మట్కా బీటర్లు.. నేడు గంజాయి విక్రేతలు
– నలుగురు అరెస్ట్, 1500 గ్రాముల గంజాయి స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం : వీరు పేరు మోసిన మట్కా బీటర్లు. ఏళ్ల తరబడి మట్కా నిర్వహిస్తూ ఎందరి జీవితాలో నాశనం కావడానికి కారకులయ్యారు. ఇటీవల పోలీసులు క్రికెట్ బెట్టింగ్, మట్కా దాడులు ముమ్మరం చేయడంతో వీళ్లు మట్కా రాయడం మానుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గంజాయి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తుంటారు. ఈ విషయం పోలీసుల చెవిన పడటంతో.. వీరి అక్రమ వ్యాపారానికి బ్రేకులు పడ్డాయి. పెన్నానదిలోని ఆర్టీపీపీ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ గూగూడు, సయ్యద్ ఖాదర్ అలియాస్ కదీర్‌తోపాటు పవర్‌హౌస్ రోడ్డుకు చెందిన టప్పా నసీర్ రసూల్, షేక్ జమాల్‌బాషాను వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 1500 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్‌బాషా అలియాస్ గూగూడుపై గతంలో మట్కా, లిక్కర్, గంజాయి తదితర సుమారు 46 కేసులు ఉన్నాయి. అలాగే సయ్యద్ ఖాదర్ అలియాస్ కదీర్‌పై కూడా వివిధ పోలీస్‌స్టేషన్లలో గంజాయి, మట్కా, లిక్కర్ తదితర సుమారు 48 కేసులు ఉన్నాయి. నసీర్ రసూల్, జమాల్‌బాషాలపై రెండేసి చొప్పున కేసులు ఉన్నాయి. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండు నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.