
ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరు చోరీ
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి గ్రామ సమీప పంట పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరు చోరీకి గురైంది. రైతు ఓబిలి రవీంద్రారెడ్డి పొలం వద్ద 364 విద్యుత్ సర్వీసు ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. పొలంలో పంటలు సాగు చేయలేదు. ఈ క్రమంలో దొంగలు రాత్రి సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందికి దించి లోపల ఉన్న రాగి వైరును తీసుకెళ్లారు. ట్రాన్సుఫార్మర్ విడిభాగాలు చెల్లాచెదురుగా పారేసి వెళ్లిపోయారు. నాలుగైదు రోజులు పొలం వైపు వెళ్లలేదని, శుక్రవారం వెళ్లి చూసేసరికి చోరీ జరిగిందన్న విషయం గుర్తించామని రైతు రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విద్యుత్ శాఖ మండల అధికారికి తెలియజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందలూరు : కడప–చైన్నె ప్రధాన రహదారిలోని నందలూరు బాహుద నది వంతెన సమీపంలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, మోపెడ్ (టీవీఎస్ ఎక్స్ ఎల్) ఢీకొన్న సంఘటనలో అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రాజంపేట మండలం బోయిన పల్లె ప్రాంతానికి చెందిన గురునాథం ప్రభుదాస్(22) నందలూరు లోని తమ బంధువుల వద్దకు వచ్చి తిరిగి రాజంపేటకు వెళుతున్న సమయంలో తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక పోలీసులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.
ద్విచక్రవాహనాలు దగ్ధం
మదనపల్లె రూరల్ : మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీలో గ్రామస్తుడైన కృష్ణమూర్తి ఇంటి ముందు గురువారం రాత్రి పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయని తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కొత్తవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి గురువారం రాత్రి ఇంటిముందు హోండా యాక్టివా, టీవీఎస్ వాహనాలను ఎప్పటిలాగే పార్కింగ్ చేశాడన్నారు. అయితే శుక్రవారం ఉదయం చూసేసరికి రెండు వాహనాలు కాలిపోయి ఉన్నాయన్నారు. గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కృష్ణమూర్తికి విభేదాలు ఉండటంతో, అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని టి.కోడూరు గ్రామంలో ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్‌ఐ ఆర్.బాసు వివరాల మేరకు.. మండలంలోని టి. కోడూరు గ్రామానికి చెందిన బుండన్నగారి రాజ వంగనూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన మొబైల్ క్యాంటీన్ పెట్టుకొని జీవనం సాగించే వాడు. బుడన్నగారి రాజ పెద్ద కుమార్తె బి.నవ్యశ్రీ(17) థైరాయిడ్‌తోపాటు కడుపు నొప్పి తాళలేక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరు చోరీ