
వేలం పాటలు వాయిదా
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ విరూపాక్షేశ్వర, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలకు చెందిన 13.25 ఎకరాల దేవదాయ భూములను మూడేళ్ల పాటు కౌలుకు ఇచ్చేందుకు అధికారులు బహిరంగంగా వేలం పాటలు నిర్వహించారు. అయితే గతంలో కన్నా ఈ సారి భూములను వేలంలో దక్కించుకునేందుకు రైతులు అధికంగా ఆసక్తి చూపారు. ఈ తరుణంలో ఓ రైతు ఏడాదికి రూ.55 వేలు ఇస్తామని వేలంలో ప్రకటించగా.. అధికారులు కుయుక్తులు పన్నారు. అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హెచ్చు పాటాదారుడికి కాకుండా.. రూ.50 వేలు పలికిన మరో వ్యక్తికి కేటాయించాలని అధికారులు భావించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ అధికారులు, కౌలు రైతుల నడుమ వాగ్వివాదాలు చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రశాంతంగా ఉంటున్న రైతుల నడుమ.. మీరు కక్షలు పెరిగేలా వ్యవహరిస్తారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలంపాటలు సక్రమంగా నిర్వహించండి లేకుంటే బీళ్లుగా పెట్టేయండని రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. మీకు ఇష్టమొచ్చినట్టు కాదు బహిరంగ వేలంలో ఎవరైతే హెచ్చుగా పాడుకుంటే వారికే కౌలుకు ఇవ్వండి, ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని అధికారులపై పలువురు రైతులు మండి పడ్డారు. ఇదిలా ఉండగా గతంలో వేలం పాటలను బహిరంగంగా వేలం వేయకుండా.. మీకు అనుకూలంగా ఉన్న పేర్లను రాసుకుని భూములను కౌలుకు ఎలా ఇచ్చారని మరి కొందరు ప్రశ్నించారు. ఎట్టకేలకు దిక్కు తోచని అధికారులు నీళ్లు నములుతూ వేలం పాటలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 16వ తేదీ నాటికి రైతుల ఆధీనంలో ఉన్న ఆలయ భూములకు అప్పగించాలని, పంటలు సాగులో ఉన్నా కూడా పోలీసుల సహకారంతో తాము స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవదాయ ఇన్‌స్పెక్టర్ శశికుమార్, ఈవో మునిరాజు, అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.
దేవదాయ శాఖ అధికారుల ధోరణిపై
మండిపడ్డ రైతులు