
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
రాయచోటి: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు తెలిపారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ కమిటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 37 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 13978 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రశ్నా పత్రాలను భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి డీఈఓ, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, మెడికల్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.