
మార్కెట్లో రవాణాకు సిద్దంగా ఉన్న టవూటాలు
● ఉమ్మడి అనంతపురం జిల్లాలోదెబ్బతింటున్న తోటలు
● 3వేలు నుంచి500మెట్రిక్‌టన్నులకు పడిపోయిన స్టాకు
● ధరలు పెరిగే అవకాశం
గుర్రంకొండ: మార్కెట్లో టమాటా ధరలు మెల్లగా పుంజుకొంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా రూ.13వరకు ధర పలుకుతోంది.వారం రోజుల క్రితం టమాటా ధరలు కిలోరూ.7 నుంచి రూ.9వరకు మాత్రమే ఉండేవి. ఇటివల కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి నుంచి జిల్లాకు వచ్చే టమాటాల స్టాకు 3వేల మెట్రిక్ టన్నుల నుంచి 500 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. కాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15 రోజుల తరువాత టమాటా పంట దిగుబడి కాలంపూర్తిగా ముగుస్తుంది.
పుంజుకుంటున్న టమాటా ధరలు
ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్‌యార్డుల్లో టమాటా ధరలు పుంజుకుంటున్నాయి. 25 కేజిల టమాటా క్రీట్ రూ.175 నుంచి రూ.225 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు స్వల్పంగా పుంజుకోవడంతో కిలో టమాటా రూ. 13 వరకు టుంది. 25కేజిల టమాటా క్రీట్ ధర రూ.325 వరకు ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటా కిలో రూ13, రెండోరకం కిలోరూ.10 మూడో రకం రూ.7వరకు ధరలు పలుకుతున్నాయి.
బయటజిల్లాలో భారీ దెబ్బ
ఉమ్మడి అనంతపురంజిల్లాల్లో ఇటివల కురిసిన వర్షాలకు అక్కడి టమాటా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో టమాటా పంట దిగుబడులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. పదిహేను రోజుల కిందటతో పోల్చితే 80శాతం మేరకు పంట దిగుబడి తగ్గిపోవడం గమనార్హం. పదిహేను రోజుల క్రితం వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి మన జిల్లాకు3 వేల మెట్రిక్ టన్నుల టమాటాల స్టాకు వచ్చేది. మన జిల్లాలో ములకల చెరువు, అంగళ్లు, మదనపల్లె, గుర్రంకొండ టామటా మార్కెట్లకు ప్రతిరోజు బయట జిల్లాల నుంచి 3 వేల మెట్రిక్ టన్నుల వరకు టమాటాల స్టాకు వచ్చేది. ప్రస్తుతం 500 మెట్రిక్ టన్నుల టమాటాల స్టాకు మాత్రమే జిల్లాకు వస్తోంది. ప్రస్తుతం రోజురోజుకు టమాటా ధరలు స్వలంగా పుంజుకొంటుండడంతో రైతుల్లో కొత్త అశలు చిగురిస్తున్నాయి.
ధరలు పెరిగే అవకాశం
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారంరోజుల కిందట వరకు అనంతపురం జిల్లా నుంచి మన జిల్లాలోని వివిధప్రాంతాల్లోని టమాటా మార్కెట్లకు రోజూ 3వేల మెట్రిక్ టన్నులస్టాకు వచ్చేవి. ప్రస్తుతం అక్కడ నుంచి 600 నుంచి 500 మెట్రిక్ టన్నుల టమాటాల స్టాకు మాత్రమే ఇక్కడి మార్కెట్లకు వస్తున్నాయి. దీంతో ఇక్కడి మార్కెట్లలో టమాటా ధరలు పెరిగే అవకాశముంది. – జగదీష్, మార్కెట్‌కమిటి కార్యదర్శి,వాల్మీకిపురం
