రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.. ఫార్మింగ్.. చూసి కళ్లు తెరవండయ్యా

అడివి చెర్లోపల్లెలో సాగులో ఉన్న డ్రాగన్‌ఫ్రూట్‌ పంట   - Sakshi

రూపు మార్చుకుంటోన్న రాయల సీమ పల్లెలు

పచ్చటి పంటలు, పళ్ల తోటలతో సాగుపై దృష్టి

ఫ్యాక్షన్ గ్రామాలు కావని నిరూపిస్తోన్న అన్నదాతలు

సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా అంటేనే ఫ్యాక్షన్‌ చరిత్రకు పర్యాయపదంగా చెప్పుకునేవారు అనేకమంది. కాలక్రమంలో ఫ్యాక్షన్‌ హత్యలు కనుమరుగయ్యాయి. హత్యలే కాదు, ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. 1990 దశకంలో 119 ఫ్యాక్షన్‌ గ్రామాలు జిల్లాలో ఉంటే, ప్రస్తుతం 60 గ్రామాల్లో మాత్రమే ఫ్యాక్షన్‌ వాసన అడపాదడపా కనిపిస్తోంది.

2022లో ఒక్క ఫ్యాక్షన్‌ హత్య కూడా జిల్లాలో నమోదు కాలేదన్న వాస్తవాన్ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి ఫ్యాక్షన్‌ క్రమేపీ తెరమరుగవుతుందన్నది సుస్పష్టం. అందుకు ప్రధాన కారణం విద్యాధికులు పెరగడమే. పుష్కరకాలం క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రధాన తోడ్పాటుగా నిలిచింది.

రైతు కుటుంబాల నుంచి వేలాది మంది విద్యావంతులయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతో ఆర్థిక పరపతి పెరగడం, ఆయా కుటుంబీకులు పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. ప్రధానంగా హార్టికల్చర్‌ పంటల సాగు గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఆదాయం గడిస్తుండడంతో ఫ్యాక్షన్‌ మూలాలను వదిలేశారు. పైగా మెట్ట ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి చేరడంతో జిల్లా ‘కల్చర్‌’ పూర్తిగా మారిపోయిందనడంలో సందేహం లేదు.

నాడు నెత్తుటి మరకలు.. నేడు పచ్చని పంటలు..

అడవిచెర్లోపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్‌ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామంలో విదేశాల్లో పండించే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను యువరైతు గంగిరెడ్డి పండిస్తున్నాడు. తన సోదరుడు అస్వస్థతకు గురైతే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లిన గంగిరెడ్డికి డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వాడడం చాలా మంచిదని చెప్పారు. వారి సూచన మేరకు కొనుగోలు చేస్తే ఒక్కో డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర రూ.150 పలికింది. ఆ పండు ధర గంగిరెడ్డి మదిలో పడింది. పంట సాగుపై అధ్యయనం చేశాడు.

ఎలాంటి రకం పెడితే మన ప్రాంతంలో దిగుబడి సాధించవచ్చో తెలుసుకున్నాడు. తమిళనాడు నుంచి మొక్కలు తెప్పించి సక్సెస్‌ఫుల్‌గా దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం టన్ను రూ.1.5 లక్షలు ధర పలుకుతుండగా, ఎకరాకు 7 టన్నులు తక్కువ లేకుండా దిగుబడి సాధిస్తున్నాడు. ఫ్యాక్షన్‌ గ్రామంలో ఆదర్శ రైతుగా గంగిరెడ్డి నిలుస్తున్నాడు. ఈ విధంగా యువకులు, విద్యాధికులు హార్టికల్చర్‌ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

పులివెందుల అరటి.. విదేశాలకు ఎగుమతి..

పులివెందుల ప్రాంతంలో పండించే అరటి పంట మంచి నాణ్యత కలిగి ఉంటోంది. అరటి రైతులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు కొన్ని వందల టన్నులు తరలివెళ్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌ దేశాలలో మంచి డిమాండ్‌ ఉంటోంది. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు రైతులు వారు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తారు.

మన దేశంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్‌, మహరాష్ట్ర, హైదరాబాద్‌ ప్రాంతాలకు పులివెందుల ప్రాంత అరటి వెళ్తోంది. ఈ ప్రాంత అరటికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది. సాధారణంగా అరటి పండ్లు ఏడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి అరటి పండ్లు 14రోజుల వరకు నిల్వ ఉంటాయని రైతులు వివరిస్తున్నారు.

కృష్ణాజలాల రాకతో..

‘మెట్ట ప్రాంతంలో కృష్ణాజలాలు పారించిన రోజు నా జన్మ ధన్యం’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజోలి రిజర్వాయర్‌ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. వాస్తవంగా కృష్ణా జలాలు రాయలసీమకు రావడంతో సీమ ప్రజల తలరాత మారుతోంది. ఎప్పుడూ కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లా పంటలతో కళకళలాడుతోంది. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో గండికోట, వామికొండ, సర్వరాయసాగర్‌, బ్రహ్మంసాగర్‌లో నీరు పుష్కలంగా ఉంది.

కృష్ణా జలాల కారణంగా ఆక్వా ఉత్పత్తుల పట్ల సైతం జిల్లా వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా చేపల పెంపకంపై దృష్టి సారించారు. చాపాడు, వీరపునాయునిపల్లె, కొండాపురం, ముద్దనూరు, బి.మఠం, బి.కోడూరు మండలాల పరిధిలో చేపల పెంపకం సాగిస్తున్నారు. క్రమేపీ ఈ రంగంలోనూ రైతులు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. ఎప్పుడూ రక్తచరిత్ర పేరుతో బురద చల్లే సినీ ప్రముఖులకు కూడా జిల్లా వాసులు సవాల్‌ విసురుతున్నారు. మా కల్చర్‌ మారిందని నిరూపిస్తున్నారు.

యువ రైతు పేరు మూలి గంగిరెడ్డి. వీరపునాయునిపల్లె మండలం అడవిచెర్లోపల్లె గ్రామం. ఇతర దేశాల్లో పండించే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటపై దృష్టి పెట్టాడు. ఎకరాకు రూ.4లక్షలు పెట్టుబడి వెచ్చించి, 4 ఎకరాల్లో పంట సాగు చేశాడు. రాయలసీమ ప్రాంతానికి అనువైన తైవాన్‌ పింక్‌ రకం వేస్తే ఇక్కడి వాతావరణానికి తట్టుకోగలదని తెలుసుకొని తమిళనాడు నుంచి మొక్కలు తెచ్చుకున్నాడు.

పట్టువదలని గంగిరెడ్డి డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట దిగుబడిలో సక్సెస్‌ అయ్యాడు. దిగుబడికి తగ్గట్టుగా ధర ఎప్పటికీ తగ్గకుండా ఉండడంతో గణనీయంగా ఆదాయం గడిస్తున్నాడు. ప్రస్తుతం ఆసక్తి ఉన్న రైతులకు ఆయనే అంట్లు కట్టి మొక్కలను అందిస్తున్నాడు.

జి.పవన్‌కుమార్‌రెడ్డి ఎంబీఏ చదివాడు. అమెరికాలో వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగించేవాడు. స్వగ్రామం అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం యనమవాండ్లపల్లె. అమెరికాలో ఎంత సంపాదిస్తున్నా తృప్తిలేదు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు మట్టి వాసనపై మమకారం పోలేదు. వ్యవసాయంపై మక్కువతో అమెరికా నుంచి వచ్చి సంబేపల్లె మండలంలోని దేవపట్లకు చెందిన తన బావ ఆవుల హర్షవర్దన్‌రెడ్డి పొలంలో 30 ఎకరాలు బొప్పాయి పంటసాగు చేశాడు.

నాణ్యమైన పంట కోసం మహరాష్ట్ర నుంచి 786 రకం బొప్పాయి నారు తెప్పించాడు. ఒక కోతకు 60 టన్నులు పంట దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నాడు. ఒకసారి పంట సాగుచేస్తే 10 నుంచి 15 కోతలు రానున్నాయి. పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తుండటంతో మండల రైతులు శభాష్‌ అంటున్నారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top