
మదనపల్లె పట్టణంలో ఇళ్ల నిర్మాణాలు
బి.కొత్తకోట: పేదలకు మంజూరు చేసిన పక్కా ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు సహకారం అందిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1.80లక్షల సాయం అందిస్తుండగా లబ్ధి దారులకు అండగా నిలుస్తూ మరింత రుణాలు అందిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ క్రాంతిపథం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటున్న మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు పొందుతున్నారు. వీరికి ఇవే సంఘాల పరిధిలో మళ్లీ అదనపు రుణాలు మంజూరు చేస్తున్నారు. పక్కా గృహాలు మహిళల పేరిట ప్రభుత్వం కేటాయింపు చేసింది. మహిళలకు సంఘాల నుంచి రుణం అందిస్తూ భరోసా కల్పిస్తోంది.
45,455 ఇళ్లకు అదనం
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 77,161 మంది పేదలకు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా వారికి అదనంగా నిధులు మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కో లబ్ధిదారునికి మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా రూ.35వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. ఈనెల 2వ తేదీ నాటికి జిల్లాలో 45,455 పక్కా గృహాలకు రూ.159.07 కోట్లను రుణంగా అందించారు. రాయ చోటి నియోజకవర్గంలో రూ.35.08 కోట్లు, పీలేరు నియోజకవర్గంలో రూ.31.57 కోట్లు, రాజంపేట నియోజకవర్గంలో రూ.22.60 కోట్లు, రైల్వేకోడూరు నియోజకవర్గంలో రూ.13.92 కోట్లు, తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.29.41 కోట్లు, మదనపల్లె నియోజకవర్గంలో రూ.26.49 కోట్లు అందించారు.
ఉపాధి ద్వారా పనులు
ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. రూ.1.80లక్షల యూనిట్ విలువలో రూ.23,130 ఉపాధి పనులు చేయించుకోవడం ద్వారా ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 23 లక్షల పనిదినాలను ఇంటి నిర్మాణాలకు కల్పించాలన్న లక్ష్యం కాగా అందులో 12.20 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో 4.84 లక్షల పనిదినాలు కల్పించి ప్రథమస్థానంలో నిలిచింది. మంజూరైన ఇళ్ల నిర్మాణాలన్నింటికి 90 రోజుల పనిదినాలు కల్పిస్తారు.
ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన ఐకేపీ రుణ వివరాలు
నిరంతరంగా రుణాలు
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేద మహిళలు నిర్మించుకుంటున్న ఇళ్ల నిర్మాణాలకు రూ.35వేలు మంజూరు నిరంతర ప్రక్రియ. ఇప్పటికే మంజూరైన ఇళ్లకు రుణాలు అందిస్తున్నాం. కొత్తగా మంజూరైన ఇళ్లకు కూడా మంజూరు చేస్తాం. కొన్ని సంఘాల నుంచి మహిళలు అధిక రుణాలు తీసుకుంటున్నారు. వీటిని వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
–సత్యనారాయణ, డీఆర్‌డీఏ జిల్లా అధికారి, రాయచోటి
రూ.లక్ష రుణం పొందా..
కురబలకోట మండలం బ్రాహ్మణఒడ్డిపల్లె వద్ద వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇంటిస్థలం కేటాయించారు. ప్రభుత్వం అందించే రూ.1.80లక్షలకు తోడు ఇంటి నిర్మాణం కోసం అదనంగా మహిళా గ్రామసమాఖ్య నుంచి రూ.లక్ష రుణం పొందాను. ప్రభుత్వ సహాయం, రుణం కలిపి ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాను. –ఎ.అనురాధ, అంగళ్లు, కురబలకోట మండలం
నియోజకవర్గం మంజూరైన వివిధ దశల్లో రుణంపొందిన
ఇళ్లు ఉన్నవి గృహాలు
రాయచోటి 19,064 13,208 10,023
పీలేరు 12,333 11,161 9,021
రాజంపేట 11,674 10,291 6,458
రైల్వేకోడూరు 7,298 7,135 3,978
తంబళ్లపల్లె 12,552 11,584 8,404
మదనపల్లె 14,240 9,076 7,571
గృహ నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1.80 లక్షల అందజేత
అదనంగా వైఎస్సార్‌క్రాంతిపథం నుంచి ఒక్కో ఇంటికి రూ.35వేలు
జిల్లాలో రూ.159.07 కోట్ల రుణాలు పంపీణీ

