వైఎస్సార్‌సీపీ యువనేత దారుణ హత్య! | YSRCP Sathish Reddy Shocking Incident At Anantapur Pamidi, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ యువనేత దారుణ హత్య!

Sep 25 2025 7:21 AM | Updated on Sep 25 2025 10:10 AM

YSRCP Sathish Reddy Incident At Ananthapur

అనంతపురం జిల్లా పామిడిలో దారుణం

బైక్‌పై ఇంటికి వస్తుండగా గొంతుకోసి హతమార్చిన వైనం 

ఇటీవలే రూరల్‌ బూత్‌ కన్వీనర్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన పార్టీ

సాక్షి, పామిడి: వైఎస్సార్‌సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న స్థానిక యువనేత బుధవారం రాత్రి అనంతపురం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు! అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీకి చెందిన యువ నాయకుడు, జీ కొట్టాల గ్రామవాసి దేవన సతీష్‌రెడ్డి (34) పామిడిలో పని ముగించుకుని రాత్రి తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయ­న్ను గొంతు కోసి హతమార్చినట్లు భావిస్తున్నారు.  

బీటెక్‌ చదివి వ్యవసాయం చేస్తూ.. 
జీ కొట్టాలకు చెందిన రైతు దేవన కాశీ విశ్వనాథ్‌రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా మృతుడు సతీష్‌రెడ్డి చిన్న కుమారుడు. బీటెక్‌ చదివిన ఆయన ఇంటివద్ద వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తన అన్న సుదర్శన్‌రెడ్డితో కలసి దాదాపు 30 ఎకరాల్లో చీనీతోట, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు. స్థాని­కంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది. మృతుడి మరో సోద­రుడు వెంకట నరసింహారెడ్డి హైదరాబాద్‌లో ఉంటు­న్నారు.  

వెనుక కూర్చుని గొంతు కోశారా? 
దేవన సతీష్‌రెడ్డిది ముమ్మాటికి హత్యేనని పామిడి మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నా­యి. ఎవరితోనూ విబేధాలు లేని వ్యక్తిని గొంతు కోసి దారుణంగా చంపడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎవరో ఆయన ద్విచక్రవాహనం వెనుక కూర్చుని గొంతు­కోసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్త­మవుతున్నాయి. ఎడమ వైపుగా వెళ్లాల్సిన వ్యక్తి కుడి­వైపున రోడ్డుపై హత్యగావించబడి ఉండడం... మృతుడి చెప్పుల్లో ఒకటి నడిరోడ్డుపై, మరొకటి కుడివైపు దూరంగా ద్విచక్రవాహనం దగ్గర ఉండడాన్ని బట్టి ఇది హత్యేనని పేర్కొ­ంటున్నారు. పామిడి ఇన్‌ఛార్జ్‌ సీఐ రాజు, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

ఇటీవలే వైఎస్‌ జగన్‌ను కలిసి సంతోషంగా.. 
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఇటీవలే సతీష్‌రెడ్డిని రూరల్‌ బూత్‌ కన్వీనర్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉంటూ యువతను చైతన్యం చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవలే కలిసి ఎంతో సంతోషంగా కనిపించిన సతీష్‌రెడ్డి దారుణ హత్యకు గురి కావడాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement