ప్రశ్నించే వారికి సంకెళ్లు YSRCP President YS Jagan Fires Back At Social Media Censorship By Chandrababu, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే వారికి సంకెళ్లు

May 22 2026 4:03 AM | Updated on May 22 2026 10:02 AM

YSRCP President YS Jagan fires back at social media censorship

అమరావతి అవినీతిపై ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను తొలగించాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘ఎక్స్‌’ కార్యాలయానికి గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ సీఐ పంపిన లేఖ

రాష్ట్రంలో సోషల్‌ మీడియా సెన్సార్‌షిప్‌పై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్‌ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్‌షిప్‌ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్‌ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్‌లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్‌ హెరిటేజ్‌ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్‌ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే కంటెంట్‌ కన్పించకుండా సోషల్‌ మీడియాను సెన్సార్‌ చేస్తున్నారని చెప్పారు. 

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేస్తారు. సోషల్‌ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్‌ (ట్విటర్‌)కు, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌ హెడ్‌క్వార్టర్‌కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్‌ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్‌ యాజమాన్యానికి కుప్పం ఇన్‌స్పెక్టర్‌ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.

పోలీసులు ఎక్కడ?
రాష్ట్రంలో ఎక్కడా పోలీస్‌ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్‌లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్‌ అమ్ముతున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్‌ బాటిల్స్‌లో ఒక బాటిల్‌æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. 

రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్‌) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్‌ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్‌ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement