ఛీ..ధర్‌రెడ్డి దరిద్రం వదిలింది

YSRCP Ministers Strong Counter to MLA Kotamreddy Sridhar Reddy - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి, రూరల్‌ ప్రజలకు పట్టిన ఛీ.. ధర్‌రెడ్డి అనే దరిద్రం వదిలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచి అదే పార్టీపై నిందలు వేయడం సిగ్గు చేటుగా లేదా అన్నా రు.

తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ అధినేత డైరెక్షన్‌లో శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రనా రూరల్‌లో మేమంతా వైఎస్సార్‌సీపీలో, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటామని ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న ప్రజాభిమానమే నిదర్శమన్నారు. పార్టీ నుంచి దరిద్రం పోయిందనుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి జిల్లా మొత్తం కంచుకోటగా ఉంటుందన్నారు. 

ఓటు బ్యాంకు చెదరదు  
పార్టీ నుంచి ఎవరు పోయినా వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో గెలిచామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ  గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూరల్‌లోనే కాకుండా జిల్లాలో అందరికీ సుపరిచితుడన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కూడా తన రాజకీయ భవిష్యత్‌ను తేల్చుకోవాలన్నారు.  

రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తా  
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేస్తూ వ్యాపారుల వద్ద, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారు ల వద్ద డబ్బులు వసూలు చేసే పద్ధతులు మానుకోవాలని ఎంపీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఎక్కడైనా అటువంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉక్కుపాదంతో అణిచేస్తానని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆయా వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ఎవరైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్‌ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎక్కడైనా సమస్య ఉందంటే తమ దృష్టికి తెస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోటలాగా ఉందన్నారు.
 
ఈ ర్యాలీనే ఉదాహరణ 
నెల్లూరురూరల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంత బలంగా ఉందో స్వాగత ర్యాలీనే ఉదాహరణ అని నగర ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌ అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్‌లో అందరం కష్టపడ్డాం కాబట్టే ఆయన గెలిచారని, ఈ రోజు పారీ్టపై విమర్శలు చేయడం ద్రోహం అన్నారు. కార్పొరేటర్‌ మొయిళ్ల గౌరీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో సైనికుల మాదిరి పని చేస్తామని, తిరిగి ఆదాలను గెలిపించుకుంటామన్నారు. బొబ్బల శ్రీనివాస్‌  మాట్లాడుతూ తాము ఈ రోజు నుంచి బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందామన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే వద్ద బానిస బతుకు బతికామన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి వద్ద ఎంతో స్వేచ్ఛగా, హుందాగా ఉంటామన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top