సీఐలు, ఎస్‌ఐలపై ఫిర్యాదు చేస్తాం | YSRCP Leaders Support to Protest Maize Farmers | Sakshi
Sakshi News home page

సీఐలు, ఎస్‌ఐలపై ఫిర్యాదు చేస్తాం

May 25 2026 5:03 AM | Updated on May 25 2026 5:03 AM

YSRCP Leaders Support to Protest Maize Farmers

గిట్టుబాటు ధర అడుగుతుంటే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు  

ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చెలరేగిపోతున్నారు  

రెచ్చిపోతున్న సీఐలు, ఎస్‌ఐలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం  

వైఎస్సార్‌సీపీ పొన్నూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించాలని అడుగుతుంటే తట్టుకోలేక తమ పార్టీ నేతలు, రైతులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, పోలీసులు వారికి వంతపాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చెలరేగిపోతున్న పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పొన్నూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్‌బాబు, పీట నాగమోహన్‌కృష్ణ మాట్లాడారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక, ప్రశ్నిస్తున్న తమను దాడులతో అడ్డుకునేందుకు ప్రయతి్నస్తోందని విమర్శించారు. పాలకుల సూచనలతో రెచ్చింపోతున్న పోలీసు సీఐలు, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో ఆయా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.  

రైతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి  
వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్తగా సామాన్య ప్రజల తరఫున పవన్‌కళ్యాణ్‌ను వేడుకుంటున్నా. దయచేసి రూ.2,400కు మొక్కజొన్నను కొనుగోలు చేయించండి. అక్రమంగా సీజ్‌ చేసిన గోడౌన్‌ ఉన్న గ్రామంలో శాంతిభద్రతల సమస్య లేదు కాబట్టి దాన్ని తెరిపించాలి. ఐదుగురు చిన్న, సన్నకారు రైతులకు వారి మొక్కజొన్నలు తిరిగి ఇచ్చేయండి. వారిపై అట్రాసిటీ కేసులు తొలగించాలి. 

పొన్నూరు రూరల్, అర్బన్‌ సీఐలు కృష్ణయ్య, నాయక్, పొన్నూరు రూరల్, చేబ్రోలు ఎస్‌ఐలు, తెనాలి సీఐలపై రెండుమూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి మా ఎంపీల సమక్షంలో జాతీయ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లలో ఫిర్యాదు చేస్తాం. వీరిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేయాలని కోరతాం. నిర్ణిత సమయంలో న్యాయం లభించకపో తే ఆ వీడియోల ఆధారంగా.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వారిని డిస్మిస్‌ చేయిస్తాం. మొక్కజొన్న రైతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి.   
– అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త  

ఎస్సీ, బీసీ, కాపు నేతలపై దౌర్జన్యాలు  
మొక్కజొన్న రైతుల కోసం అంబటి మురళీకృష్ణ చేసిన ఉద్యమం ఎక్కడ సక్సెస్‌ అవుతుందో అన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ఎత్తులు పారడం లేదు. జగన్‌ పిలుపు మేరకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేస్తున్నాం.  మామిళ్లపల్లిలో సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 ఎందుకు పెట్టారో డీజీపీ చెప్పాలి.

మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం ఇద్దరు, ముగ్గురు గుమికూడకపోయినా, సభలు, సమావేశాలు పెట్టకపోయినా మురళి ఇంటికి వెళ్తుంటే ఎలా అరెస్టు చేస్తారు? అంబటి మురళి ఇంట్లో ఉన్న జూపూడి ప్రభాకర్‌ని లాక్కెళ్లడం 144 సెక్షన్‌ కిందకు వస్తుందా? రేపల్లె సమన్వయకర్త పీట మోహన్‌ని కూడా లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. పొన్నూరు సీఐ కృష్ణయ్య పీట మోహన్‌ మెడమీద కొట్టారు. సీఐ పోలీసు యూనిఫాం వేసుకున్నారా? లేక పచ్చచొక్కా వేసుకున్నారా? దురుసుగా వ్యవహరించిన పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తారు.  – వరికూటి అశోక్‌బాబు, వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త  

గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేరు?  
మామిళ్లపల్లిలో మొక్కజొ న్న రైతులకు తీవ్ర అన్యా యం జరిగింది. మొక్కజొన్న రైతులకు పక్క రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇంతమంది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఎంతో అనుభవజు్ఞడినని చెప్పుకొనే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రైతుల్ని ఇబ్బంది పెట్టడంలో చూపిస్తున్నారు. మొక్కజొన్న రైతులే కాదు ఆక్వా రైతుల్ని కూడా డీజిల్, పెట్రోల్‌ ధరలు పెంచి ఇబ్బంది పెడుతున్నారు.

మామిళ్లపల్లిలో 14 మంది రైతులపై కేసులు పెట్టారు. నేను సంఘీభావం తెలపడానికి వెళ్తే ఎలా ఈడ్చుకెళ్లారో అందరూ చూశారు. మీ ప్రభుత్వంలో ఉన్న కులాలనే పట్టించుకుని, ఇతర కులాల్ని ఇబ్బందులు పెడతారా? మొక్కజొన్న రైతుల్ని ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటాలు తప్పవు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన నాతో పాటు మాజీమంత్రి జోగి రమేశ్‌ మీద కూడా ఇలాగే దాడులు చేస్తున్నారు. బీసీ కులాల మీద మీకున్న గౌరవం ఇదేనా?   
– పీట నాగమోహన్‌కృష్ణ, వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త    

Advertisement
 
Advertisement
Advertisement