కాకినాడ జిల్లా సామర్లకోటలోధర్నా చేస్తున్న పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తదితరులు
డీజిల్ సంక్షోభంపై వైఎస్సార్‌సీపీ ధర్మాగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
అన్ని పెట్రోల్, డీజిల్ బంక్‌ల వద్ద ఆందోళనలు
పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలని నేతల డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్రమైంది. వారం రోజులుగా ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. సంక్షోభాన్ని నివారించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పైగా కృత్రిమ కొరతకు కారణమైంది. పర్యవసానంగా రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంఓ చంద్రబాబు సర్కార్‌ను మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపు నిచి్చంది.
మంగళవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు ప్రజలు భాగస్వాములు కావటం విశేషం. దీంతో నిరసన కార్యక్రమం దిగి్వజయమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నేతలు ఎండగట్టారు. ‘ఏపీలో మద్యం పుల్ .. డీజిల్ పెట్రోల్ నిల్, పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు.. ఇక్కడే ఎందుకు? ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం, ఇంధనం అవసరమైనంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసిన ప్లకార్డులు వైఎస్సార్‌సీపీ నాయకులు చేతపట్టుకొని బంకుల వద్ద నిరసన తెలిపారు.

పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. వారం రోజులుగా తీవ్ర సమస్య ఉన్నా.. బాబు సర్కారు పబ్లిసిటీ డ్రామాలు ఆడడం ఏమిటని నిలదీశారు. మొన్న యూరియా .. నిన్న గ్యాస్ .. నేడు ఇంధన కొరత! ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజలకు నిత్యం నరకం కనపడుతోందని దుయ్యబట్టారు. ఈ ఇంధన సంక్షోభం బాబు సృష్టించిందేనని విమర్శించారు. విజయవాడ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు పబ్లిసిటీ స్టంట్లు ఆపి.. వట్టిమాటలు కట్టిపెట్టి ఇంధన సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..
⇒ ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
⇒ గుంటూరులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు.
⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు నిరసన తెలిపారు.

⇒ కోనసీమజిల్లా కొత్తపేటలో డీజిలు లేక ఆగిపోయిన రైతు ట్రాక్టరుకు పగ్గం కట్టి బంకు వద్దకు తీసుకువచ్చి వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు నిరసన గళమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్లతో నిరసన తెలిపారు. రాజోలులో ట్రక్కు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు.
⇒ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. రాజమండ్రిలో పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ డీజిల్ డబ్బాలతో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లాలోనూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు సాగాయి.
⇒ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకులు పెట్రోల్ బంకులను సందర్శించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇒ విశాఖ జగదాంబ జంక్షన్‌లో ఆటోలకు తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలియజేసి, క్యూలో ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు గళమెత్తారు.
⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీ డీజిల్ డ్రమ్ములతో నిరసన తెలిపారు.
⇒ తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించి వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు.


