రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి | YSRCP Leader Vangaveeti Narendra Alleges Chandrababu Role in Vangaveeti Ranga Murder Case | Sakshi
Sakshi News home page

రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి

May 26 2026 6:01 AM | Updated on May 26 2026 6:01 AM

YSRCP Leader Vangaveeti Narendra Alleges Chandrababu Role in Vangaveeti Ranga Murder Case

నాటి హోంమంత్రి కోడెల, ఎస్పీ వ్యాస్‌ పాత్రధారులు 

రంగా హత్య జరిగింది.. కేసు కొట్టేసింది టీడీపీ హయాంలోనే.. 

విజయవాడలో ఏ ఇంటికి వెళ్లి అడిగినా రంగాను చంపించింది చంద్రబాబే అని చెబుతారు 

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే వైఎస్‌ కుటుంబంపై దుష్ప్రచారం 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్‌

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అయితే, నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాస్‌ పాత్రధారులు. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబట్టే మంత్రి పదవితోపాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని హరిరామ జోగయ్య అప్పుడే చెప్పారు. విజయవాడలో ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడని చెబుతారు.’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టంచేశారు.

ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందనే సీబీఐ విచారణకు నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ చేయాలని కోరింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారు. రంగా హత్య జరిగినప్పుడు, కేసును కొట్టేసినప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది.

రంగా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు జైలులో ఉండేవారు. అప్పట్లో దర్యాప్తును ప్రభావితం చేయడానికే వర్గ విభేదాల పేరుతో కట్టుకథలు అల్లారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే తనను ఈ కేసులో ఇరికించాడని దేవినేని నెహ్రూ పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కాపు కులానికి చెందిన జర్నలిస్టు పింగళి దశరథరామ్‌ దారుణ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు.’ అని వంగవీటి నరేంద్ర చెప్పారు. 

చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట
‘రంగా హత్యకు కడప నుంచి బాంబులు తెచ్చారని చంద్రబాబు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. సీబీఐ విచారణను ఎందుకు కోరలేదు. కాంగ్రెస్‌లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వికృతంగా చూపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట. 1985లో రంగాకి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దని చాలా మంది అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్‌ టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు.

అలాంటి సన్నిహితుల మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు వారు చనిపోయిన తర్వాత కట్టుకథలు సృష్టించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడుకుని దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరితే వైఎస్సార్‌పై బురదచల్లడం సిగ్గుచేటు. వైఎస్‌ జగన్‌ అడిగి ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేక వైఎస్సార్‌ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.’ అని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement