రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్‌సీపీ పిలుపు | YSRCP Calls For Chalo Mamillapalli On May 13th | Sakshi
Sakshi News home page

రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్‌సీపీ పిలుపు

May 12 2026 2:00 PM | Updated on May 12 2026 2:17 PM

YSRCP Calls For Chalo Mamillapalli On May 13th

సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్‌స్టర్‌గా మారారంటూ మండిపడ్డారు.

‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది

..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement