సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్‌కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.
పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్‌లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్‌పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.
ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు.


