రాష్ట్రాభివృద్ధికి వైఎస్ జగన్ ఆచరణాత్మక ప్రతిపాదన
నాడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుకు కృషి
అయితే దీనిపై చంద్రబాబు విష ప్రచారం
దీంతో నేడు ప్లాన్ బీగా మూడు నగరాల సమాహారంతో మావిగన్ ఆలోచన.. ఇప్పటికే పటిష్టమైన మౌలిక వసతులతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ట్రై సిటీస్
పోర్టు అనుసంధానంగా వేగంగా వృద్ధి చెందిన చైనా షెన్‌జెన్‌తోపాటు ముంబై, చెన్నై నగరాలు
రూ.5,155.77 కోట్లతో అప్పట్లోనే మచిలీపట్నం పోర్టు పనులు చేపట్టిన వైఎస్ జగన్
గన్నవరం వద్ద అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు
విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్లతో దేశవ్యాప్తంగా అన్ని మూలలకు రైల్వే కనెక్టివిటీ
ఇటు కృష్ణా, అటు పోలవరం కుడికాలవ ద్వారా గోదావరితో పుష్కలంగా నీటి లభ్యత
ఎన్‌టీటీపీఎస్ థర్మల్‌తో పాటు పోలవరం 960 మెగావాట్ల జలవిద్యుత్‌తో కావాల్సినంత ఇంధన వనరులు
అమరావతి మౌలికవసతుల కల్పన వ్యయంలో మావిగన్‌కు కేవలం పది శాతం ఖర్చు చాలు
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో వేగంగా పోటీ పడే అవకాశం ఉందంటున్న ఆర్థికవేత్తలు, మేధావులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.
ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు.
ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు.
వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధి
దేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్‌జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్‌గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్‌ను రాజధాని కారిడార్‌గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.
ఇతర మౌలిక వసతులకు కొదవలేదు
ఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది.
అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్‌కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభా
మావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్‌గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.
మావిగన్‌తో అందరికీ మేలు
రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం
అత్యంత వాస్తవిక ఆలోచన
మావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం


