ఆప్కో,లేపాక్షి ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

YS Jagan Mohan Reddy Launch Lepakshi And APCO Online Store From Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : ఆప్కో- లేపాక్షి ఆన్‌లైన్‌ వెబ్‌స్టోర్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..

బీసీలకు పెద్దపీట :
'దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం.
ఆ వర్గాలకే చెందిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా ఇవాళ రెండు ఆన్‌లైన్‌ స్టోర్లు ప్రారంభిస్తున్నాం.వాటి ద్వారా మన కళలు, చేతి వృత్తులను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం అది మాత్రమే కాదు, ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన మంత్రాలయం ప్రతినిధులు)

ఆప్కో–లేపాక్షి :
ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్, లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా మన రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు మరింత మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో వాటికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎవరు కొనుగోలు చేసినా, అన్నీ సక్రమంగా అందేలా పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది. 

ఈ–ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటు :
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా,  వంటి ఈ–ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఆర్డర్‌ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్‌ చీరలు, వస్త్రాలు, డ్రెస్‌ మెటేరియల్స్, బెడ్‌షీట్లు పొందవచ్చు.ఇక లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కళంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలుబొమ్మలు పొందవచ్చు.అలా మన కళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్థానం లభిస్తుంది.
ఆ విధంగా ఆ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ లభిస్తుందని 'ఆశిస్తున్నాను.

హస్త కళాకారులకు ఆర్థిక సహాయం :
'హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నాం.  ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ రెండింటి వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. జిల్లాలలో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్‌ స్టోర్స్‌లోకి తీసుకురావాలి.ఈ కళలు కలకాలం ఉండాలంటే, వాటికి అండగా నిలవడం ఎంతో అవసరం.ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బ్రతుకుతోంది. అలాంటి వృత్తులు బ్రతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం .' అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన జగన్‌ ఆన్‌లైన్‌లో ఒక చీరను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, లేపాక్షి అధికారులతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.(చదవండి : స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top